సిరిసిల్లను వదలవి నకిలీ నోట్లు

సిరిసిల్ల నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. నేత కార్మికుల నిరక్షారాస్యతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ జోరుగా నకిలీ నోట్లను చెలామణిచేస్తున్నారు. పెద్ద నోట్లలో సుమారు 30 శాతం వరకు నకిలీ నోట్లు చేరి ఉంటాయని ఓబ్యాంకు అధికారి అనుమానం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

సిరిసిల్లకు చెంది ఓ మద్యం వ్యాపారి బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు వెళ్లగా రూ. వెయ్యినోట్ల రెండు నకిలీవిగా బ్యాంకు అధికారులు గుర్తించారు. దీంతో ఆ నోట్ల తాలుకూ డబ్బులు వ్యాపారి నష్టపోవాల్సి వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన ట్రాక్టర్‌ యజమాని ఒకరు సిరిసిల్ల పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ పోయించి రూ.500 నోట్లు ఇవ్వగా… అందులోనూ ఓ నకిలీ బయటపడింది. ఈ విధంగా నిత్యం ఏదోఒక చోట నకిలీనోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. రూ.1000, రూ.500 నోట్లు వచ్చాయంటే అమ్మో అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలోనూ ఇదే తుంతు…సిరిసిల్లలోని ఓ బ్యాంకులో ఆరు నెలల కిందట తొంభై నకిలీ రూ. వెయ్యి నోట్లు బయటపడ్డాయి. స్థానికంగా పేరున్న ఓ వస్త్ర వ్యాపారి వ్యాపారరీత్యా రూ. ఎనిమిది లక్షలను డీడీ తీసేందుకు బ్యాంకుకు వెళ్లి నోట్ల కట్టల్లో వెయ్యినోట్లను జత పరిచినట్లు సమాచారం , డీడీ కోసం క్యాష్‌ను కౌంటర్‌లో చెల్లించకుండా తనకున్న పరిచయాలతో నేరుగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో డీడీని సిద్ధం చేస్తూ నోట్లను పరిశీలించగా… ఓ వెయ్యి రూపాయల నోటు అనుమానాస్పందంగా కనిపించింది. నోట్ల కట్టల్ని తరచి చూడడంతో ఏకంగా తొంభై వెయ్యి రూపాయల నోట్లు బయటపడ్డాయి. సదరు వ్యాపారి తనకున్న పలుకుబడితో బ్యాంకు అధికారులను మేనేజ్‌ చేసి బయటపడినట్లు ప్రచారం జరిగింది. నగదుతో నకిలీ దందా… సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో శ్రమించే కార్మికులకు వారం వారం డబ్బులు చెల్లిస్తారు. బ్యాంకు ద్యారా లావాదేవీలు జరపకుండా వస్త్ర వ్యాపారులు నేరుగా డబ్బులు తెచ్చి కార్మికులకు ఇవ్వడంతో నకిలీ నోట్ల చెలామణికి అవకాశమేర్పడుతోంది. మెజార్టీ కార్మికులు నిర్లక్షరాస్యులు కావడంతో నకిలీ నోట్ల చెలామణికి అవకాశమేర్పడుతోంది. మెజార్టీ కార్మికులు నిరక్షరాస్యులు కావడంతో నకిలీ నోట్లను గుర్తించకుండా మార్కెట్లోకి వదులుతున్నట్లు భావిస్తున్నారు. రోజు ఐదారు నకిలీ రూ. 500 నోట్లు వస్తున్నాయని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా నకిలీ నోట్లు వచ్చి చేరుతున్నాయన్నారు. సిరిసిల్లలోని వివిధ వాణిజ్య బ్యాంకుల్లోనూ నకిలీ నోట్ల ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఒకటీరెండూ నకిలీ నోట్లు వచ్చిన సందర్భాల్లో బ్యాంకు అధికారులే చించివేస్తూ, ఫేక్‌ అని రాస్తూ ఆ నోట్లు మళ్లీ వినియోగంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సిరిసిల్లలో ఇటీవల నాలుగు నకిలీ నోట్ల ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1000, రూ,500 నోట్లలో 30శాతం మేరకు నకిలీ నోట్ల చెలామణి అధికంగా కనిపిస్తోందని సదరు అధికారి తెలిపారు. ముందుకు సాగని పోలీసు విచారణ… నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులు కొంత మేర కూపీ లాగినా పూర్తి స్థాయిలో నకిలీ నోట్ల గుట్టును రట్టు చేయడంలో విఫలమయ్యారు. బ్యాంకులో 90 నకిలీ నోట్టను జత చేసిన వస్త్ర వ్యాపారి విషయంలో పోలీసులు విచారణ జరిపినా ఎందుకో మధ్యలోనే వదిలేశారు. ఈ విషయంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి సిరిసిల్ల కేంద్రంగా సాగుతున్న నకిలీ నోట్ల రాకెట్‌లో బడా వ్యాపారుల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు ఈ నకిలీ నోట్ల వ్యవహారంపై దృష్టి సారిస్తే… నకిలీనోట్ల రాకెట్‌ బయటపడనుంది.