సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఆదిలాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. 8శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించి 12శాతానికి పెంచారు. ఒక నెల రోజుల వరకు 12 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్‌లలో ధర ఎక్కువగా లభిస్తోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.5వేల చొప్పున ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువ ఇస్తున్నందువల్ల ప్రైవేటు వారికే ఎక్కువగా విక్రయించే అవకాశం ఉంది.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యాపారుల ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లపైన స్పష్టత రాలేదు. అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి సీజన్‌లోనూ రైతులను తేమ పేరుతో వ్యాపారులు నిండా ముంచుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీఐ పత్తి కొనుగోలు చేయడానికి తేమ 8శాతాన్ని మించకూడదు. అంత కంటే ఎక్కువ శాతం తేమ ఉంటే కొనుగోలు చేయబోమని సీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు మించి తేమ శాతం ఎక్కువే ఉంటుంది. దీనిని
పరిగణలోకి తీసుకుని కొత్త ఆదిలాబాద్ జిల్లాలో 12శాతం వరకు తేమ ఉన్నా ఎటువంటి కోతల్లేకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు కొనుగోళ్లకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా తేమపైన లెక్కతేలకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు వ్యాపారులతోనే కొనుగోళ్లు మొదలు పెట్టనున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆరులక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మంచిర్యాల, చెన్నూర్, ఇందారం, లక్సెట్టిపేట, బెల్లంపల్లి ప్రాంతాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మార్కెట్ యార్డుల్లో కూడా పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. రైతులకు ఎక్కడైతే ఎక్కువ ధర లభిసుందో అక్కడే విక్రయించు కునేలా అవకాశం ఉంటుంది. నిర్మల్, భైంసా, కుభీర్, సారంగాపూర్, కడెం ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుసంధానంగా ప్రైవేటు కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.