సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖుల నివాళి

పుష్పాంజలి ఘటించిన అమిత్‌ షా, అజిత్‌ ధోవల్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖులు నివాళులర్పిచారు. ఢల్లీిలోని సైనిక దవాఖాన నుంచి వారి భౌతికకాయాలను రావత్‌ నివాసానికి తరలించారు. ప్రజలు, ఆర్మీ సిబ్బంది సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. రావత్‌ దంపతులకు పుష్పాంజలి ఘటించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, ఢల్లీి గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ నివాళులు అర్పించారు.సీడీఎస్‌ రావత్‌ దంపతులకు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు సైనిక సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్‌ మార్గ్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఢల్లీి కంటోన్‌మెంట్‌లోని బ్రార్‌ స్వ్వేర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గోర్ఖా రైఫిల్స్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. బిపిన్‌ రావత్‌కు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధూలిక రావత్‌ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ కూడా బిపిన్‌ రావత్‌ దంపతులకు నివాళులు అర్పించారు.హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వివిధ మతాలకు చెందిన పెద్దలు ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్‌ రావత్‌ దంపతుల భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.