సీడ్‌హబ్‌గా తెలంగాణ: మంత్రి
నిజామాబాద్,జనవరి25(జనంసాక్షి): తెలంగాణ రాష్టాన్న్రి సీడ్‌హబ్‌గా కేసీఆర్ తయారుచేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించిందని మంత్రి పోచారం శ్రీనివసారెడ్డి అన్నారు. రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పంటలు పండించేందుకు రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. రైతాంగం పంటల కోసం ప్రభుత్వం పెట్టుబడి రూపంలో ప్రతి ఎకరాకు రెండు పంటలకు రూ.4 వేల చొప్పున రూ.8 వేలు అందించబోతుందన్నారు. రైతులు పండించిన పంట దళారుల చేతుల్లో మోసపోకుండా రైతుల సమన్వయ సమితులచే కొనుగోలు చేయించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలకు, నాయకులకు ఉందన్నారు. పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. 24 గంటల విద్యుత్, రైతు సంబంధ సమస్యలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండడంతో పైరవీలకు తావులేకుండా పోయిందని పేర్కొన్నారు. దీనికి తోడు జిల్లాల విభజన జరిగి పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావడంతో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలతోపాటు విభజన సమస్యల పరిష్కారంకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఉమ్మడి సర్వీస్‌రూల్స్ సాధనతోపాటు సీపీఎస్, సీసీఈ విధానాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తున్నా మన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు.