సీతారామం స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌గా అమెజాన్‌

హక్కులు దక్కించుకున్నట్లు ప్రచారం
యంగ్‌ సూపర్‌ స్టార్‌ దుల్ఖర్‌ సల్మాన్‌ తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ’సీతారామం’ హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో దుల్ఖర్‌ లెప్టినెంట్‌ రామ్‌గానూ, మృణాల్‌ ఠాకూర్‌ సీతగానూ నటిస్తున్నారు. అందాల రష్మికా మందణ్ణ కాశ్మీరీ ముస్లీమ్‌ అమ్మాయి అఫ్రీన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది.’ యుద్ధంతో రాసిన ప్రేమకథ’ ట్యాగ్‌ లైన్‌ తో ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం రూపొందుతోంది. ఒక అందమైన యువతితో యుద్దానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికుడు ప్రేమలో పడితే వారి బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ అందమైన పీరియాడికల్‌ లవ్‌స్టోరీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ’సీతారామం’ చిత్రం ఆగస్ట్‌ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ విడుదల కానుంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌ పార్టనర్‌ ఎవరన్న విషయంలో ఒక వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ’సీతారామం’ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ పూర్తయిన తర్వాత అగ్రిమెంట్‌లో సూచించిన గడువులో అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేయబోతున్నట్టు టాక్‌. అయితే విడుదలైన ఎన్నిరోజులకు స్ట్రీమింగ్‌ కానుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ నడుస్తోంది. ఈ సినిమా దుల్ఖర్‌ నటజీవితంలోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాలో ఇంకా గౌతమ్‌ విూనన్‌, ప్రకాశ్‌ రాజ్‌, సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పీయస్‌ వినోద్‌ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రధాన భాగం కాశ్మీర్‌లో షూటింగ్‌ జరుపుకోవడం విశేషం. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక పోస్టాఫీస్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. హీరో ఇక్కడి నుంచే కథానాయికకు ఉత్తరాలు రాస్తాడు. కథను కీలక మలుపు తిప్పే ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సీన్స్‌ కోసం చిత్ర బృందం ఎన్నో కష్టాలు పడ్డట్టు దర్శకుడు హను రాఘవపూడి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు