సీపీఐ జాతీయ మహాసభలకు లక్షలాదిగా తరలి రావాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):సీపీఐ 24వ జాతీయ మహాసభలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ తెలిపారు.మొదటి రోజు జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక బొమ్మగాని ధర్మబిక్షం భవన్ లో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు పునాదిగా ఈ బహిరంగసభ వేదిక కానున్నదన్నారు.దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు.బీజేపి ప్రభుత్వం మతం, దేవుడు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతూ దేశ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. 70 ఏళ్లుగా కాపాడుకుంటున్న పరిశ్రమలు ,సంస్థలు కంపినీలను మొత్తము అదానీ, అంబానీలకు అమ్ముతున్నారని అన్నారు.ప్రపంచ కుబేరులుగా అదానీ, అంబానీలను తయారు చేయడమే కర్తవ్యంగా పీఎం మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు.కాంట్రాక్ట్ కార్మికలకు కనీస వేతన చట్టంను అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. పోరాటాలు ద్వారానే ప్రజలు సమస్యలు పరిష్కారమవుతాయని,పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని సూచించారు.అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు గత కార్యక్రమాల సమీక్ష , భవిష్యత్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఉస్తేల నారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నాయకులు యల్లావుల రాములు , మేకల శ్రీనివాసరావు , ధూళిపాళ ధనంజయ నాయుడు , పాలకూరి బాబు, యల్లంల యాదగిరి, మండవ వెంకటేశ్వర్లు , కంబాల శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లు, ఎస్ కె లతీఫ్, దేవరం మల్లీశ్వరి, బూర వెంకటేశ్వర్లు , ఖమ్మంపాటి రాము, గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.