సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ షరతులను ఉల్లఘించారని.. అందువల్ల ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. జగన్‌ ఉద్దేశపూర్వకంగానే సాక్షులను బెదిరిస్తున్నారని.. కోర్టులో విచారణను కూడా ప్రభావితం చేసేలా ప్రవరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇందుకు నిదర్శనమని సీబీఐ కోర్టుకు పేర్కొంది.

అయితే సీబీఐ ఆరోపణలను జగన్‌ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షి నిర్వహణతో గానీ.. రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూలో ఈ కేసు విచారణను ప్రభావితం చేసే అంశాలు లేవని పేర్కొన్నారు. రెండువర్గాల వాదనలు విన్న  కోర్టు సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది.

మే 15 నుంచి కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లేందుకు సీబీఐ  కోర్టు జగన్‌కు అనుమతి ఇచ్చింది. వేసవి సెలవుల కారణంగా కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం న్యూజిలాండ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు.

తాజావార్తలు