సీబీఐ విచారణ జరపండి

2

– డీడీసీఏ అవినీతిపై కీర్తి అజాద్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ) కేసుపై సీబీఐ విచారణ చేపట్టాలని సస్పెండ్‌ అయిన భాజపా ఎంపీ కీర్తి ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. డీడీసీఏలో జరిగిన అవినీతిపైనే తాను పోరాటం చేస్తున్నానని.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై కాదని ఆయన స్పష్టంచేశారు. దిల్లీ క్రికెట్‌ సంఘంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డీడీసీఏ ఛైర్మన్‌గా పనిచేసిన అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్‌ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. దిల్లీలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ భాజపాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే వ్యాఖ్యలను ఆజాద్‌ ఖండించారు. తాను భాజపాకు వ్యతిరేకం కాదని.. గత కొన్నేళ్లుగా క్రీడల్లో అవినీతిపై పోరాటం చేస్తున్నానని.. ఇకవిూదట కూడా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇందులోకి అరుణ్‌జైట్లీని తీసుకురావొద్దన్నారు. డీడీసీఏలో అవినీతి జరిగినట్లు తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. డీడీసీఏలో అవినీతిపై విచారణకు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.