సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి
ప్రాణాపాయస్థితిలో మరొకరు
నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం
ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి
బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం
నెల్లూరు, జూలై 26 : భద్రాచలం నుంచి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఈ బస్సులో వెళుతున్న నలుగురి వ్యక్తులపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి వారి గొంతు కోశాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ (26) అనే వ్యక్తిని సూళ్లూరుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృత్యువాతపడినవారిలో ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన రమేష్ బాబు (30), ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అనిల్‌బిస్వాస్ (30), కావలి పట్టణానికి చెందిన నిరంజన్ (28) ఉన్నట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం భద్రాచలం నుంచి 55 మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం బయలు దేరిన ఎపీ 29 జడ్ 1543 ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నెల్లూరుకు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో చేరుకుంది. నెల్లూరు బస్టాండ్‌లో సుమారు 45 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి చెన్నైకి టిక్కెట్ తీసుకున్నాడు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తడ మండలం దాటిన తర్వాత బస్సు భీములవారిపాలెం చెక్‌పోస్టు వద్దకు రాగానే బస్సులో ఉన్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో బస్సులో ఉన్న నలుగురు వ్యక్తులను పొడిచాడు. ఈ సంఘటన నుంచి మిగతా ప్రయాణికులు తేరుకునే సరికే ఆ వ్యక్తి బస్సులోంచి దిగి వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ హత్యకు పాల్పడ్డ వ్యక్తిని అటు బస్సు డ్రైవర్ గాని, ఇటు కండక్టర్ గాని పోల్చుకోలేకపోయారు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమేష్ అనే వ్యక్తి స్పృహలోకి వస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన సాంబశిరావు అనే సైకో ఈ ఘాతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సైకో సాంబ ఖమ్మం జిల్లాలో కనిపించినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడే బస్సు ఎక్కి ఉంటాడని, ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. అయితే సాంబకు హత్య చేసే లక్షణంలేదని పోలీసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తిరుగుతున్నాడని అనుమానిస్తున్న కేరళ నర హంతకుడు ఆంటోని కూడా ఈ పని చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భీములవారిపాలెం చెక్‌పోస్టు వద్ద విషాదవాతవరణం నెలకొని ఉండగా బస్సు అంతా రక్తంతో తడిచి ముద్దయింది. గూడూరు డీఎస్పీ సురేష్‌కుమార్, జిల్లా ఎస్పీ బి.విరమణకుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. హంతకుడిని గుర్తించడానికి పోలీస్ జాగిలాను కూడా ఒంగోలు నుంచి తెప్పిస్తున్నారు. తడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని అధికారులను, దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.