సుక్మా జిల్లాలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు
ఛత్తీస్గఢ్, జూన్15(జనం సాక్షి ) : సుక్మా జిల్లాలోని చిత్రగుఫా ఏరియాలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిత్రగుఫా ఏరియాలో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఘటనాస్థలి వద్ద మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.