సుప్రీం తీర్పుతో సత్యం గెలిచింది

శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్య
ముంబై,నవంబర్‌26(జనం సాక్షి): బుధవారంలోగా మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుపై శివసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలించిందంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ ట్విటర్లో స్పందిస్తూ..  సత్యానికి ఆటంకాలు ఎదురుకావచ్చు. కానీ సత్యం ఎప్పుడూ ఓడిపోదు… జైహింద్‌ అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ కోష్యారీ నిర్ణయాలను సవాల్‌ చేస్తూ శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రొటెం స్పీకర్‌ సారథ్యంలో  బుధవారం సాయంత్రంలోగా సభ్యుల చేత ప్రమాణాలు చేయించి బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కాగా తమకు మొత్తం 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ… ఏంజరగబోతుందో విూరే చూడడంటూ రావత్‌ ఇవాళ ఉదయం ట్విటర్లో వ్యాఖ్యానించారు.  50-50 ఫార్ములాకు భారతీయ జనతా పార్టీ అంగీకరించకపోవడంతో.. శివసేన ఇతర పార్టీలతో జతకట్టేందుకు సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే శివసేన – కాంగ్రెస్‌ – ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మూడు పార్టీల కలయికకు శివసేన ట్రబుల్‌ షూటర్‌, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ ఎంతో శ్రమించారు. శివసేన సైనికుడే సీఎం అవుతారని ఆయన పలుమార్లు నొక్కిచెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల విషయంలో నిజమే గెలిచిందన్నారు. బలనిరూపణకు కోర్టు 30 గంటల గడువు ఇచ్చింది. కానీ అంత సమయం తమకు అవసరం లేదు. 30 నిమిషాల్లో తమ బలాన్ని నిరూపిస్తామని సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.