సుప్రీం హుకుం..

2
ఆధార్‌తో ఓటరు అనుసంధానం రద్దు

హైదరాబాద్‌ ఆగస్ట్‌14(జనంసాక్షి):

ఆధార్‌తో ఓటరు అనుసంధానం ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని అన్ని రాష్గాల ఎన్నికల అధికారులకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఓట్లను తొలగించాలన్న ఉద్దేశంతో ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని గతంలో అన్ని రాష్గాల ఎన్నికల సంఘాలకు జాతీయ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్గాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆధార్‌పై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు అన్నింటికీ ఆధార్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం ఎల్పీజీ సబ్సిడీ, రేషన్‌లకు మాత్రమే దీన్ని అనుసంధానించాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి ఎన్నికల సంఘానికి శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.