సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

 

హ్యూస్టన్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి):

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియవమ్స్‌  127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి  చేరుకున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఆమె సోయజ్‌ క్యాప్యూల్స్‌తో కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానాలలో ల్యాండ్‌ అయ్యారు. ఈ ఏడాది జులై 15న కజకిస్తాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్లిన వీరు ముగ్గురు, 125 రోజులపాటు అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ పరిశోధనాశాలలో జరిగే పరిశోధనలలో పాలు పంచుకున్నారు. వీరి రాక తర్వాత ప్రస్తుతం అక్కడ ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. వీరు వచ్చే ఏడాది భూమి మీదకు తిరిగి వస్తారు. వీరి స్థానాలను భర్తి చేయడానికి అమెరికా, కెనెడ, రష్యా దేశాలకు చెందిన ముగ్గురు ఫ్లైట్‌ ఇంజనీర్‌లు ఈ ఏడాది డిసెంబర్‌ 19న బైకనూరు నుంచి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు బయలుదేరి వెళతారు. వీరు అక్కడ 5నెలలపాటు ఉంటారు. పరిశోధనాశాల బాధ్యతలను ఇప్పటివరకు నిర్వహించిన సునీతా, వాటిని అక్కడ కొనసాగుతున్న వ్యోమగామి ఫోర్డ్‌కు అప్పగించారు. ఈ అంతరిక్షయాత్రతో ఆమె, మహిళ వ్యోమగాములలో అత్యధికకాలం స్పేస్‌వాక్‌ చేసిన వ్యక్తిగా రికార్డు స్థాపించారు. ఇంతకు ముందు 2006 డిసెంబర్‌ 9నుంచి 2007 జూన్‌ 22వరకు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో పరిశోధనలలో పాల్గొన్నారు. ఈ రెండు యాత్రలలో కలిపి సునీత మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్‌ చేశారు. ఈ స్పేస్‌వాక్‌లలో ఆమె 50గంటల 40నిమిషాలు గడిపారు.