సుల్తాన్‌ బజార్‌ నుంచి మెట్రోరైలు

3

– మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):  సుల్తాన్‌బజార్‌ మెట్రో  సమస్య పరిష్కారమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ వ్యాపారులు గతకొంత కాలంగా ఆందోళనచేస్తుండగా వారికి భారీ ప్యాకేజ్‌ ప్రకటించారు.  శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 63శాతం మెట్రో పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. సుల్తాన్‌బజార్‌ను ఆకర్ష ప్యారడైజ్‌గా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. నగరంలోని సుల్తాన్‌ బజార్‌ నుంచి వెళ్లనున్న మెట్రో రైలు పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే వెళ్తుందని మెట్రో ఎండీ తెలిపారు. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే సుల్తాన్‌బజార్‌లో మెట్రో రైలు పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదుట కూడా పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే మెట్రో పనులు జరగాలని ఆదేశాల్లో తెలిపారని వివరించారు. పాత అలైన్‌మెంట్‌ కంటే కొత్త అలైన్‌మెంట్‌తోనే ఎక్కువ నష్టమని గమనించామని తెలిపారు. సుల్తాన్‌బజార్‌లోని జైన్‌, ఆర్య సమాజ్‌ భవనాలకు ఎలాంటి ముప్పు ఉండదని చెప్పారు. 2 వేల గజాల్లో మెట్రో సుల్తాన్‌ బజార్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రత్యేకంగా హ్యాకర్స్‌ ప్యారడైజ్‌, నైట్‌ బజార్‌గా మారుస్తామన్నారు ఉప్పల్‌ నుంచి యాదాద్రి వరకు హైస్పీడ్‌ మెట్రో రైల్‌ నిర్మాణం చేపడతామని ఈ ప్రణాళిక తయారు చేయమని సీఎం కేసీఆర్‌ సూచించారని తెలిపారు. ఇందుకోసం ఎకరా స్థలం కూడా తీసుకున్నట్లు వివరించారు. మెట్రోతో ఎవరికీ నష్టం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే నగరంలోని సైఫాబాద్‌ మెట్రోభవన్‌ వద్ద శనివారం సుల్తాన్‌బజార్‌ భవన యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. సుల్తాన్‌బజార్‌ విూదుగా మెట్రోరైలు మార్గాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.