సూత్రదారిని వదిలేసి..  పాత్రదారిపై దాడులెందుకు!


– రేవంత్‌ పై ఐటీ దాడుల్లో బయటపడ్డ సొమ్ము ఎవరిది
– చంద్రబాబుకు న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28(జ‌నంసాక్షి ) : తెలంగాణ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి నివాసాలపై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న సొమ్ము ఆయనదేనా? లేక చంద్రబాబుదా? అని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టగానే  ఓవర్గం విూడియా ‘రేవంత్‌ పై పంజా’ ‘భావోద్వేగానికి లోనైన రేవంత్‌’ అంటూ సానుభూతి కథనాలను వడ్డిస్తుందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా దొరికిన దొంగను హీరోగా చూపడం వెనుక రహస్యం ఏంటని భూమన ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు సూత్రధారిని మూడేళ్ల పాటు వదిలేసి పాత్రధారిపై దాడులెందుకు జరుగుతున్నాని చెప్పారు. చంద్రబాబు భార్య భువనేశ్వరీ పేరుపై రూ.1,200 కోట్లు, మంత్రి లోకేశ్‌ పేరుపై రూ.500 కోట్లు ఉన్నాయనీ, చివరికి చంద్రబాబుతో పాటు చిన్నపిల్లాడు దేవాన్ష్‌ కూడా సంపాదిస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తనను ఎవ్వరూ ఏవిూ చేయలేరన్న ధైర్యంతోనే చంద్రబాబు ధర్మాబాద్‌ కోర్టు సమన్లకు గతంలో స్పందించలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. చంద్రబాబు అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైన చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.