సెక్యులర్‌ అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలి

జేడీయూ సంచలన నిర్ణయం
పాట్నా, (జనంసాక్షి) :సెక్యులర్‌ భావజాలం ఉన్న అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలని జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం పాట్నాలో జనతాదళ్‌ (యునైటెడ్‌) ముఖ్య నేతలు శరద్‌యాదవ్‌, నితీశ్‌కుమార్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికారి ప్రతినిధి నీరజ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. భారత్‌ సెక్యులర్‌ దేశమని, ముమ్మాటికీ ప్రధాని అయ్యే అభ్యర్థి కూడా అలాంటి భావజాలమే కలిగి ఉండాలన్నారు. అతివాద భావజాలం ఉన్న అభ్యర్థిని ఏన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ముందుకు తీసుకురావడం సరికాదని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చోటు కల్పించడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో జేడీయూ అధినేత, ఎన్‌డీఏ కన్వీనర్‌ శరద్‌యాదవ్‌ స్పందిస్తూ బీజేపీ నిర్ణయంతో వచ్చిన నష్టమేమి లేదన్నారు. బీజేపీ విధానం, ఎన్డీఏ నిర్ణయం ఒకటి కావని స్పష్టం చేశారు. జేడీయూ తాజా నిర్ణయంతో ఎన్డీఏ ముక్కలవుతుందా అనే సందేహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బీహార్‌ సీఎం నితీష్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ప్రకటించే కూటమితో జట్టు కడతామని ప్రకటించారు. ఈనేపథ్యంలోనే జీడీయూ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం.