సెక్యూరిటీ పటిష్టానికి కసరత్తు
గోదావరిఖని (కరీంనగర్) , జనంసాక్షి : సింగరేణి విభాగాన్ని పటిష్ట చేయడానికి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంతర్గాతంగా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంస్థ పరిధిలోని గనుల, డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికులలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడానికి ఉత్సాహం చూపే వారి నుంచి దరకాస్తులు స్వీకరించి నియమించడానికి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన ఫైల్ సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య వద్ద సిద్దంగా ఉంది.
ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 1800 మంది సెక్యూరిటీ (ఎస్‌అండ్‌పీసీ)గా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 2200 మంది ఉండాలి గార్డులు తక్కువగా ఉండడంతో రక్షణ చర్యలు సరిపోక అక్కడక్కడా దొంగతనాల నివారణ సాధ్యపడడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి యాజమాన్యం ప్రథమికంగా మరో 100 మందిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకునేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి దశల వారీగా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
జైపూర్ విద్యుత్ ప్లాంట్ భద్రతపై అధ్యయనం
సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని జైపూర్ నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రానికి భద్రత విషయమై కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గేట్ నుంచి ప్టాంట్ వరకు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను సీఎండీకి త్వరలో అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను మరింత ఎక్కువ మందిని తీసుకునేలా తయారు చేయనున్నట్లు సమాచారం.
దొంగతనాల నివారణపై దృష్టి
సింగరేణిలో దొంగతనాల నివారణపై యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల ఎస్సీలకు సింగరేణి సీఎండీ ప్రత్యేకంగా లేఖలు రాయగా సంస్థ విస్తరించి ఉన్న ప్రాంతాల సీఐలు, ఎస్‌ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గతంలో కంటే బొగ్గు, ఇనుప తుక్కు దొంగతనాలు పట్టాయి. వాటిని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన చర్యల చేపట్టడానికి యాజమాన్యం ఆలోచిస్తోంది.
సీఐఎస్‌ఎఫ్‌తో సింగరేణికి భారం
సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కేవలం సింగరేణిలోని స్టోర్లు, మందుగుండు భద్రపరిచే మ్యాగ్జిన్ గదులు, వర్క్‌షాపులు. టింబర్‌యార్డుల వద్ద భద్రత చూస్తున్నారు. ఉమగుండం, బెల్లంపల్లి రీజియన్లలో మాత్రమే వీరి సేవలు అందుతున్నాయి. 1985 సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాలో ఓ అధికారిపై సికాస(సింగరేణి కార్మిక సమాఖ్య) దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నాటి నుంచి సంస్థలో సీఐఎస్‌ఎఫ్ సేవలను వాడుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన
ఆర్మ్‌డ్ రిజర్వ్ గార్డుల ను సైతం మందుగుండు సామగ్రి భద్రపరిచే మ్యాగ్జిన్ గదుల వద్ద రక్షణకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వినియోగానికి సింగరేణి యాజమాన్యం దాదాపు 20 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.
ఎలాంటి ఆయుధాలు లేకుండానే భద్రత కల్పిస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సంస్థనే వాహనాలు, క్వార్టర్లను సమకూర్చుతోంది. వీరు చేసే పనులన్నిటినీ సింగరేణి సెక్యూరిటీ గార్డులు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్ వల్ల మీదపడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకుని, సొంత సెక్యూరిటీని పెంచుకోవడానికి యాజమాన్యం కసరత్తు చేస్తోంది.