సెప్టెంబరు 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమే
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విద్రోహదినమేనని సిపిఐ (ఎంఎల్) రామచంద్రన్ రాష్ట్ర నాయకులు ఎల్లుట్ల ఉపేందర్, జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ అన్నారు.శనివారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి, స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్రోహ దిన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి , వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిందని అన్నారు.నేడు ఆ పోరాట వారసత్వానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు తామే వారసులమంటూ ఊరేగుతున్నారని విమర్శించారు. వాళ్ళ కుట్రలను అర్థం చేసుకొని దోపిడీ, పీడనలేని సమాజం కోసం ప్రజలంతా ఐక్యమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.1948 సెప్టెంబర్ 17ను విమోచన, విలీనం, సమైక్యత దినాలుగా పాలకవర్గాలు జరుపుతున్నాయన్నారు.నాటి పోరాట పటిమ ఏమిటో తెలంగాణ సమాజం చూస్తుందన్నారు.పాలకుల కుయుక్తులను తిప్పికొడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుల అమరత్వాన్ని ఎత్తి పడుతూ, విముక్తి పోరాటంలో ముందు నిలువాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు చామకూరి నరసయ్య , దుబ్బ మధు, దాసరి మహేందర్, దుర్గం సైదులు , ప్రసాద్, భాను, బాచి, లింగన్న, వెంకట్, బోడ లింగరాజు, ఎలుక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.