సెప్టెంబర్ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ
విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత
కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా..
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా జరపాలని నల్లా జెండాలు ఎగుర వేయగా, మరి కొందరు విద్యార్థులు తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నల్లా జెండాల తోపాటు జాతీయ జెండాలను కూడా ఎగుర వేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ విలీన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. టీజీవీపీ ఆధ్వర్యంలో ఉదయం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుందో.. అదే మాదిరిగా సెప్టెంబర్ 17ను కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు బయల్దేరారు. వారిని పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్దే అడ్డుకున్నారు. విద్యార్థులు ఓయూ దాటి వెళ్తే పరిస్థితి చేయితప్పుతుందని భావించిన పోలీసులు వారిని అక్కడే అడ్డగించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని, వెళ్లనివ్వాలని విద్యార్థులు కోరారు. అయితే, అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అటు ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెల్లాచెదురు చేసేందుకు ఖాకీలకు లాఠీలకు పని చెప్పారు. విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. వెంటపడి మరీ ఇంజనీరింగ్ కళాశాల వరకు విద్యార్థులను తరిమారు. లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఉస్మానియాలో ఒక్కసారిగా వాతావరణం వేడేక్కింది. మరోవైపు, కొందరు విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.