సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం.
సిపిఎస్ రద్దు కోరుతూ యుఎస్పీసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు31(జనంసాక్షి):
ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించిన సిపిఎస్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యుఎస్పీసి (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 న జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు యుఎస్పీసి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు టియస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.వహీద్ ఖాన్, యం.శ్రీధర్ శర్మ డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.రామస్వామి, లక్ష్మణ్ లు ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసి) భాగస్వామ్య సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ పిఎఫ్ఆర్డీఎ చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగులకు అమలవుతున్న సిపిఎస్ విధానం వారికి పదవీ విరమణ తరువాత కనీస పెన్షన్ అందకుండా సామాజిక ఆర్థిక భద్రత లేకుండా చేసిందని వారి పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 1, 2004 సంవత్సరం నుండి సిపిఎస్ అమలు చేస్తున్నారని కనుక సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం గా పరిగణిస్తూ యుఎస్పీసి (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 4.40 నిమిషాల నుండి నిరసన ప్రదర్శనలు జరుగుతాయని ఉపాధ్యాయులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.