‘సెల్’ఘాతానికి ముగ్గురు బలి!
హైదరాబాద్,(జనంసాక్షి): నెట్వర్క్: అప్రమత్తంగా ఉండకపోతే సెల్ఫోన్లు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు విద్యుత్ షాక్‌కు గురికావడం, చార్జింగ్‌లో ఉన్న ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా ఫోన్లను చార్జింగ్ పెడుతూ విద్యుత్ ఘాతానికి గురై రాష్ట్రంలో 24 గంటల్లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని వేర్వేరు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన బొమ్మెర సోమనర్సయ్య(55) సోమవారం రాత్రి ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. అలాగే వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామ శివారులోని రేఖియా తండాకు చెందిన బానోతు రాజశేఖర్ (26) సోమవారం రాత్రి బల్బు హోల్డర్‌కు సెల్చార్జర్ను కనెక్ట్ చేయడానికి ప్రయత్నించగా… చార్జర్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే జిల్లా గీసుకొండ మండలం నందనాయక్‌తండా శివారు ఎస్టీ తండాకు చెందిన బాదావత్ నరేశ్ (20) మంగళవారం సాయంత్రం తమ ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా… విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. ఇలాంటి ఘటనల్లో పెద్ద సంఖ్యలో సెల్ వినియోగదారులు గాయపడుతున్నారు కూడా.
అప్రమత్తంగా ఉండాలి..
కనీస జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చార్జింగ్ అయ్యేటప్పుడు మొబైల్ ఫోన్లు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, చార్జింగ్‌లో ఉన్నప్పుడు కాల్ చేయటం ప్రమాదకరమని పేర్కొంటున్నారు. చార్జింగ్ అయ్యేటప్పుడు ఫోన్లోని మదర్ బోర్డ్‌పై ఒత్తిడి పెరుగుతుందని, దానితో పాటు అనుసంధానం చేసిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పేలిపోయే అవకాశముంటుందని చెబుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల ఫోన్లలో ఈ ఒత్తిడిని అధిగమించే స్థాయి కాంపోనెంట్స్‌ను వినియోగిస్తారని, నాసిరకం కంపెనీలు చవకగా అందించే లక్ష్యంతో తక్కువ నాణ్యమైనవి వాడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఈ సూచనలు పాటిస్తే చాలు..
* ఫోన్లను చార్జింగ్ చేసుకునేందుకు ఇష్టమొచ్చిన చార్జర్లను వినియోగించవద్దు. బ్యాటరీ సామర్థ్యం, చార్జర్ సామర్థ్యం సరిపోలుతుందా పరిశీలించాలి. వోల్టోజీ సామర్థ్యంలో హెచ్చుతగ్గులుంటే బ్యాటరీ పేలిపోయే అవకాశముంది.
* మొబైల్ చార్జింగ్ వంద శాతం నిండగానే.. చార్జర్ నుంచి వేరు చేయాలి. లేకపోతే బ్యాటరీ, ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కి పేలిపోయే ప్రమాదముంటుంది.
* ఇంట్లో విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేకున్నా, ఎర్త్ వైర్ లేకున్నా.. ఎలక్ట్రానిక్ పరికరాలు షాక్ కొడుతుండడం తెలిసిందే. మొబైల్ ఫోన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎర్త్ వైరింగ్ సరిగాలేని చోట చార్జింగ్ చేస్తే… మొబైల్ కూడా షాక్ కొడుతుంది. సాధారణ ప్లగ్ ద్వారా చార్జింగ్ చేస్తే అరగంటలో వేడెక్కే ఫోన్.. ఎర్తింగ్ లేకపోతే ఐదు నిమిషాల్లోనే వేడెక్కుతుంది. దీంతో ఫోన్లోని పరికరాలు పేలిపోతాయి.
* వేలాడే విద్యుత్ తీగలకు మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేయటం ప్రమాదకరం. నాణ్యమైన ప్లగ్‌లు, బ్రాండెడ్ చార్జర్లను వినియోగించాలి. కొన్నిచోట్ల నేరుగా స్తంభాలకు తీగలు వేలాడదీసి దొంగచాటుగా విద్యుత్ వాడుకుంటారు. అలా వచ్చే విద్యుత్‌ను మొబైల్ చార్జింగ్కు వినియోగించడం ప్రమాదకరం.
* చార్జింగ్ అవుతున్న ఫోన్‌కు కాల్ వస్తే.. ముందు చార్జర్ నుంచి వేరు చేసిన తర్వాతే ఎత్తి మాట్లాడాలి. చార్జింగ్ నుంచి తొలగించినప్పుడు ఫోన్ బాగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే… ఆ సమయంలో కాల్ చేయకపోవడమే మంచిది.
* చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే వంద శాతం చార్జింగ్ అయినట్లు చూపించే మొబైల్ ఫోన్లు చాలా ప్రమాదకరమని గుర్తించాలి.
* నీటిలో పడిన ఫోన్లు, తడిసిన ఫోన్లతో మరింత అప్రమత్తంగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడు చార్జింగ్ పెడితే విద్యుదాఘాతానికి గురికావచ్చు. వాటిని సర్వీసింగ్ సెంటర్లో ఇవ్వడం శ్రేయస్కరం.
* వేగంగా వెళుతున్న కార్లు, రైళ్లలోనూ ఫోన్‌తో కాల్ చేయకుండా ఉండడం మంచిది. సిగ్నల్స్ బలహీనంగా ఉండటం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి పేలుడుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* అంతర్జాతీయ స్థాయిలో ‘కాల్ బాంబింగ్’ అనే విద్రోహ చర్య కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. వేర్వేరు దేశాల నుంచి వచ్చే కాల్స్, మిస్డ్ కాల్స్‌తో ఈ ప్రమాదం ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వీటికి తిరిగి కాల్ చేసినా, ఎక్కువ సేపు మాట్లాడినా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.