‘సెస్”ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురీత తప్పదా.!

 

 

 

 

 

 

అధికార పార్టీ నాయకుల్లో అంతర్గత విభేదాలు కొంప ముంచనున్నాయా.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ.

సెస్ పీఠం దక్కించుకునేందుకు కమలం నేతల ఎత్తుగడలు ఏంటి.

పోటీకి మేము సిద్ధమంటున్న బహుజన సమాజ్ పార్టీ.

సెస్ ఎన్నికలపై “జనం సాక్షి” స్పెషల్ ఫోకస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, డిసెంబర్ 12. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెస్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో అధికార పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహలతో ఎన్నికల పోరు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు సర్వశక్తులు వొడ్డి సెస్ పీఠం దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రైతుబంధు తో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీకి ఏ మేరకు కలిసొస్తాయో అన్నది ప్రస్తుతమైతే ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. సెస్ రిజర్వేషన్ల ప్రక్రియ పై రాజకీయ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పద్మశాలి సంఘం తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఏకంగా మీడియా ముఖంగా పద్మశాలి సంఘం నాయకులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల టౌన్ వన్ టౌన్ టు లో ఈ విషయం ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు అధికార పార్టీ బరిలో ఎవరిని ఉంచుతుందన్నది స్పష్టత రాకపోవడం ఆశవాహులలో నిరాశకు కారణమవుతుంది.మరోవైపు ముందస్తుగా తామే బరిలో ఉన్నామంటూ కొందరు నాయకులు ఏకంగా ప్రచార బరిలో దిగిపోయారు, ఈ విషయంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది, పార్టీ నిర్దేశించకుండానే ప్రచార బరిలో దిగిన వాళ్ళు రేపు పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోతే అధికార పార్టీలోనే ఉంటూ పక్క పార్టీ అభ్యర్థుల గెలుపు కొసం పరోక్షంగా సహకరిస్తారా అన్న చర్చ జిల్లాలో నడుస్తుంది..దాదాపు మొత్తం 15 డైరెక్టర్ల స్థానాల్లోను పైకి చెప్పకపోయినా అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మండలాల్లో అమలు కానీ రుణమాఫీ ధరణితో సతమతమవుతున్న మెజార్టీ రైతాంగం ఏ పార్టీ వైపు నిలబడతారన్న చర్చ సీరియస్ గా నడుస్తుంది, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని. ఇటీవల కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిజాయితీగా ఎన్నికలు నిర్వహించే దమ్ము అధికార టిఆర్ఎస్ పార్టీకి ఉందా అంటూ సూటిగా వేసిన ప్రశ్నను గమనంలోకి తీసుకుంటే ఆర్థికం, అంగ బలాన్ని అధికార పార్టీ నమ్ముకుని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలను చక్కదిద్దకపోతే ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురిత తప్పదన్న చర్చ నడుస్తోంది

వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ…

సెస్ ఎన్నికల నోటిఫికేషన్ ముందస్తుగా పోరు సమయాత్తమైన పార్టీ కాంగ్రెసే. కాంగ్రెస్ పార్టీ కి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. జిల్లా విస్తృత స్థాయి సమావేశం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రజల్లో ఆదరణ ఉన్నవారిని డైరెక్టర్లుగా బరిలో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు చెప్పి విజయం కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు, మండలాల వారిగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఎజెండాగా మలుచుకుని ప్రచారం చేసి,విజయం సాదించెందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆర్థికంగా అధికార పార్టీని ఢీ కొంటుదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మెజార్టీ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం కనిపిస్తుంది.

 

కమలం నేతల ఎత్తుగడలు ఏంటి.

అధికార పార్టీకి సెస్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెబుతున్న కమలం నేతల ఎత్తుగడలు ఏంటనేది స్పష్టత లేకుండా ఉంది. భారం అంత బండి సంజయ్ పై ఉంచి నాయకులు అధిష్టానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. సిరిసిల్ల ముస్తాబాద్ తోపాటు కొన్ని మండలాల్లో మాత్రమే బిజెపి ఆశావాహులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులు ఎన్నికల విషయంలో స్పందించకపోవడం కరీంనగర్ ఎంపీగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కనీసం ఒక్కసారి కూడా సెస్ సమావేశాలకు హాజరు కాకపోవడం పార్టీకి ప్రతికూల విషయాలే.సెస్ అవినీతిపై స్థానిక నాయకులు ఆరోపణలు చేస్తున్నా, స్థానిక ఎంపీగా బండి సంజయ్ మాట్లాడకపోవడం అధికార పార్టీకి ఇప్పుడు కలిసి వచ్చే విషయమే. వేములవాడ నియోజకవర్గం మినహాయిస్తే సిరిసిల్ల నియోజకవర్గంలోనూ కమలం పార్టీలో అంతర్గత విభేదాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఏ అంశాలను కేంద్రంగా చేసుకొని కమల నేతలు ఎన్నికల బరిలో దిగుతారన్నది వేచి చూడవలసి ఉన్నది.

ఎన్నికల బరిలో మేము ఉన్నాం…

సెస్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కూడా బరిలో దిగేందుకు సమాయత్తం అవుతుంది. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సెస్ ఓటర్లను మెజార్టీగా తమ వైపు మలుచుకునే అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాకలి రమేష్ తెలిపారు. రాష్ట్ర పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన మేరకు తాము బరిలో దిగి సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే బహుజన సమాజ్ పార్టీ కూడా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతున్నదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సిపిఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించవచ్చు. సిపిఎం పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచుతుందా లేదా అన్నది స్పష్టత లేదు. వైయస్సార్ టిపి. కూడా ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతామని జిల్లా అధ్యక్షులు చొక్కాలు రాము స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి అధికార పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు ఎదిరితే అని చెప్పొచ్చు…