సేంద్రియ పద్దతులను అవలంబించండి

అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి

కామారెడ్డి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు సాంకేతిక పద్ధతుల్లో, సేంద్రియ విధానంలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. దీంతో పెట్టుబడులు తగ్గడమే గాకుండా పంటలకు డిమాండ్‌ కూడా దక్కుతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ గ్రామ రైతులు ఉపయోగించే పద్ధతులను పరిశీలించి అవలంభించాలని అన్నారు. పాలీహౌస్‌ ద్వారా పూల సాగు చేస్తున్న వివిధ రకాల చామంతి పూలను కలెక్టర్‌ ఇటీవల అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన పద్ధతుల్లో సాగు చేయడంపై రైతును కలెక్టర్‌ అభినందించారు. కొత్త తరహాలో పాలీహౌస్‌లో సాంకేతిక పద్ధతుల్లో పూలను సాగు చేయడం అభినందనీయమన్నారు. రైతులు ఎక్కువ స్థలంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోవడం కన్నా, సాంకేతిక పద్ధతుల్లో, నూతన ఆలోచనలతో తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను పండించాలన్నారు. ప్రతి రైతూ కొత్తగా వస్తున్న టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండి, వాటి ద్వారా సాగు చేసేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రుణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని అన్నారు. పాలీహౌస్‌ కోసం ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.