సైకో సంచారం.. రైల్వే పోలీసులు అప్రమత్తం

విజయవాడ, జూలై 29 : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తున్నట్లు, వారు బస్సుల్లో, రైళ్లల్లో కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆదివారం విజయవాడ రైల్వే ఎస్పీ కృష్ణానంద్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలె ఆర్టీసీ బస్సులో ఒక సైకో ముగ్గురిని హత్య చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ అలాంటి వారు రైళ్లలో కూడా ఎక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రైల్వే స్టేషన్లలో తిరుగుతూ ఉండే అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించాలని, వారి వద్ద ఆయుధాలు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలని ఎస్పీ సూచించారు. రైళ్లను కూడా తనిఖీ చేయాలని, ఎవరిపైనైనా అనుమానం కలిగితే అక్కడే విచారించాలని ఆయన ఆదేశించారు.