సైనిక శక్తికి సాంకేతిక పరిజ్ఞానం తోడవ్వాలి

5

– మిలటరీ యువ ఇంజనీర్లకు రాష్ట్రపతి ఉద్భోధ

హైదరాబాద్‌,డిసెంబర్‌ 19(జనంసాక్షి):   సైనిక శక్తి సాంకేతిక పరిజ్ఞానం తొడవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ యువ మిలటరీ ఇంజనీర్లకు సూచించారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే విద్యార్థుల ముందున్న సవాల్‌ అన్నారు.శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సికింద్రాబాద్‌ లోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లో జరిగిన 96వ డిగ్రీ ఇంజినీరింగ్‌, 24వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సు స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ రంగానికి అత్యుత్తమ సేవలు అందించాలని యువ మిలిటరీ ఇంజినీర్లను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. కొత్త పరిజ్ఞానంతో ప్రత్యర్థులకు ధీటుగా శక్తి, సామర్థ్యాలను పెంపొందించేందుకు నిరంతర శ్రమ అవసరమన్నారు. దేశ రక్షణశక్తిని బలోపేత చేయడంలో సైన్యం, సాంకేతికత వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని రక్షణరంగం వినియోగించుకునేందుకు యువ సాంకేతిక నిపుణులు తోడ్పడాలని సూచించారు. సైనిక ఆధునీకరణను మరింత వేగవంతంగా చేపట్టేందుకు వీలైనన్ని చర్యలను తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  కోరారు. యువ మిలిటరీ ఇంజినీర్లు దేశ సైనిక సత్తాకు ఓ కొత్త రూపాన్ని ప్రసాదించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రక్షణ దళాలు వినియోగించే ఆయుధాల ఆధునీకరణకు కావాల్సిన సాంకేతిక నిపుణతను యువ ఇంజినీర్లు సాధించాలని కోరారు. పౌర సమాజానికి సైనిక టెక్నాలజీ చాలా ఉపయోగపడిందని ప్రణబ్‌ తెలిపారు. సంక్లిష్ట సమయాల్లో సైనిక టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అవసరమైన సాంకేతికను అలవరుచుకునే బాధ్యత యువ ఇంజినీర్లపైనే ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రక్షణ దళాల అవసరాల కోసం  తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని యువ  సాంకేతిక నిపుణులు అందిపుచ్చుకొంటూ  సైనిక సంబంధిత నవీన ఆవిష్కరణలను వేగవంతం  చేయాలని సూచించారు.  మన సైనిక బలగాలు సాంకేతిక పురోగతులను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థులపై పై చేయి సాధించేలా వారికి అండదండగా నిలుస్తారన్న ఆశావాద దృక్పథంతో దేశం యావత్తూ విూవైపే చూస్తోందని ఆయన అన్నారు. సైన్యేతర ఆవిష్కరణలకు భారత సైన్యమే దివిటీ గా నిలిచిన విషయాన్ని యువ సాంకేతిక నిపుణులు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి అన్నారు. సైనిక సాంకేతికత పౌర సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, తద్వారా జాతి అభివృద్ధికి కూడా దోహదపడిందని ఆయన గుర్తుచేశారు.గతంలో జరిగిన పలు యుద్ధాల ఫలితాలను చూస్తే సాంకేతికత కీలక పాత్ర పోషించిన విషయం అవగతం అవుతుందని రాష్ట్రపతి అన్నారు. బలమైన ప్రత్యర్థులపై సైనిక పరంగా పై చేయి సాధించాలంటే నిరంతరం సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందంజ వేయాలని రాష్ట్రపతి స్పష్టం చేశారు.  సైనిక సామర్థ్యాలను మరింతగా పెంచాలన్నా, అభివృద్ధి పరచాలన్నా సైనిక దళాలు, సాంకేతికతను వ్యూహాత్మక భాగస్వాములుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి చేతుల విూదుగా విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ సైనిక అధికారులు పాల్గొన్నారు.