” సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల
శేరిలింగంపల్లి, జూలై 20( జనంసాక్షి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల రూపాయల విలువచేసే గంజాయి, ఇతర మారకద్రవ్యాలను పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. ఈమేరకు సైబరాబాద్ పోలీసులు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం… కమిషనరేట్ పరిధి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా సీజ్ చేయబడి తమ స్వాధీనంలో ఉంచుకున్న 1338.5 కిలోల గంజాయి, 485 మిల్లీగ్రాముల వీడ్ ఆయిల్, 11 గ్రాముల కొకైన్ తదితర మాదకద్రవ్యాలను దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పలువురు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ సహకారంతో పూర్తిగా తగలబెట్టి ధ్వంసం చేయడం జరిగిందన్నారు. గత రెండేళ్లలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఐదున్నర టన్నుల గంజాయి, 10.86 లీటర్ల హశిష్/ వీడ్ ఆయిల్, 141 కిలోల అల్ప్రాజోలం 206 గ్రాముల కొకయిన్, 200 గ్రాముల ఓపియం, 333 గ్రాముల ఇతర మాదక ద్రవ్యాలు పట్టుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వ్యాప్తి, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మాదకద్రవ్యాల వినియోగంవల్ల ఎందరో జీవితాలు సర్వనాశనమవుతున్నాయని, కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, నీరసంస్కృతి పెద్దరిల్లుతుందన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం చాలా కఠినంగా ఉందని, ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.