సోనియాతో టీ ఎంపీల బైటక్
తెలంగాణ ఇవ్వకుంటే ఊళ్లల్లో తిరగలేం
ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకుంటు రెండుచోట్ల పుట్టగతులుండవ్
అపాయింట్‌మెంట్ సంపాదించిన టీ ఎంపీలు
న్యూఢిల్లీ : తెలంగాణ అంకం చివరి దశకు చేరుకున్నట్లే ఉంది. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు ఉప ఎన్నికలు ముగిసిన దగ్గరుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. వీలు దొరికినప్పుడల్లా అధిష్టానం పెద్దలకు తెలంగాణ అవసరాన్ని నొక్కి చెపుతున్నారు. ఐతే తెలంగాణ ఎంపీలు మాత్రం ఈ సారి అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ అంశం రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2014లో తిరిగి అత్యధిక స్థానా లను గెలుచుకోవాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని టి.కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీతో పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై అణచివేత ధోరణి అవలంభిస్తుండటంతో జగన్ పార్టీ మెల్లిగా పుంజుకుంటోందని వారు అధినేత్రికి విన్నవించినట్లు తెలుస్తోంది.కనుక రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించారు. ఇంకా సాగదీత విధానాన్ని కొనసాగిస్తే 2014ఎన్నికల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని వారు సోనియాకు పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సీమాంధ్రలోనూ టీజి వెంకటేష్ వంటి నాయకులు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేదు కాబట్టి తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ విభజనపై హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తెరాస పరకాలలో విజయం సాధించడంతో తెలంగాణ వాదం బలంగా ఉన్నదనీ, సభలు, సమావేశాల్లో పదేపదే చెపుతున్నారు. వీటన్నింటికీ తలొగ్గి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు ముందడుగు వేసే అవకాశం ఉంటుందేమోనని సీమాంధ్ర నాయకులు సైతం ఢిల్లీకి క్యూ కడుతున్నారు. మొత్తంమీద ఉప ఎన్నికల ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఏం చేస్తుందో చూడాలి.