సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి సానుకూలంగా స్పందించిన మేడమ్‌

 

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా చర్చిస్తోందని, సమస్య పరిష్కారం కోసం ఓపిక పట్టాలని తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలకు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సూచించారని సమాచారం. తెలంగాణపై తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర ఆందోళనలు అక్కర్లేదని అన్నట్లు సమాచారం. సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంట్‌ లాబీలో భేటీ అయ్యారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సోనియాకు వినతి చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయని వారు అన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా తాము నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఉందని చెప్పారని తెలుస్తోంది. ఇక్కడ ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఉదయం పార్లమెంటు సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడగానే పార్లమెంటు లాబీలోకి వచ్చిన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఐదుగరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాజయ్య, మధుయాష్కి, గుత్తాసుఖేందర్‌ రెడ్డి, వివేక్‌, మందాజగన్నాథం కలుసుకున్నారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పార్టీకే నష్టం వాటిల్లుతుందని, పార్టీ ప్రతిష్ట దిగాజారుతుందని ఎంపీలు తెలిపారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గడంతో ప్రజల ముందు తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఎంపీలు సోనియా దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన సోనియా తెలంగాణపై అన్ని అంశాలు పరిశీలిస్తున్నామని, తెలంగాణ ఎంపీలతో ఎప్పుడు భేటీ అవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతవరకు పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు సోనియా హితవు చేశారు.తెలంగాణ అంశంపై పార్లమెంటు- శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రెండు రోజులుగా పార్లమెంటు- ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే.ఇదిలావుంటే అధినేత్రి సమాధానంతో ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు.సోనియాను కలిసేందుకు విడిగా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు కాబట్టి, నేరుగా లోక్‌సభలో ఆమె కూర్చునే సీటు వద్దకెళ్లి నోట్‌ ఇవ్వాలనే ముందుగా నిర్ణయించారు. తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోతోందని, దీనిపై తక్షణమే మాట్లాడేందుకు అవకాశమివ్వాలని నోట్‌లో కోరాలనుకున్నారు. గత సమావేశాల్లో సభను స్తంభింపజేసినప్పుడు ప్రతిపక్షం మాదిరిగా చేయొద్దని సోనియా  చెప్పారు. ఆ మేరకు పార్లమెంటు బయటే ఆందోళన వ్యక్తం చేశారు. తాజా సమావేశాల సందర్భంగానూ రెండు రోజులపాటు పార్లమెంటు వెలుపలే ఆందోళన చేశారు. ఆదివారం రాత్రిక్కడ సీనియర్‌ ఎంపీ మందా జగన్నాథం నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభలోనే సోనియాగాంధీకి నోట్‌ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఆయనతోపాటు ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు హాజరయ్యారు. తెలంగాణ సాధించే విషయంలో కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే దిశగా సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

డిసెంబరు 9లోగా తెలంగాణపై తేల్చకుంటే, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని, కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రకటించకపోతేఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ మనుగడ కష్టమేనని వ్యాఖ్యానించారు. డిసెంబరు 9లోగా కేంద్రం ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయమై చర్చించారు. తెలంగాణ వాదం తగ్గిపోయిందని పేర్కొనే వారిలో తాజా సూర్యాపేట సభ వణుకు పుట్టిస్తోందని ఎంపీ మధుయాస్కీ వ్యాఖ్యానించారు. ఖమ్మం, భువనగిరిల్లో సభలు నిర్వహించిన ఒక పార్టీలో చేరతామని భావిస్తున్న వారికి సూర్యాపేట సభ కనువిప్పు అన్నారు.  ఐకాస, ఇతర పార్టీలన్నీ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొంటున్నాయనీ, సిసలైన తెలంగాణ వాదులంతా ఒకే తాటిపైకి వస్తున్నారన్నారు. డిసెంబర్‌ 9కి ఇంకా 15 రోజుల సమయం ఉన్నందున ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం రాకుంటే ఏం చేయాలన్న దానిపై తదుపరి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు

తాజావార్తలు