స్కీం పేరిట వందలాది మందిని మోసం చేసిన సంఘటన

జన్నారం, జనంసాక్షి: ద్విచక్రవాహనాల అమ్మకానికి స్కీంను ప్రారంభించి వందలాది మందిని మోసం చేసి ఉడాయించిన సంఘటన జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మండల కేంద్రంలో ధనలక్ష్మీ మోటార్స్‌ పేరుతో పదేళ్లుగా ద్విచక్రవాహనాలను విక్రయిస్తున్నారు. సంపత్‌, ఆనంద్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వాయిదాల్లో డబ్బులు చెల్లించి ద్విచక్రవాహనం పొందేలా స్కీంను ప్రారంభించారు. దీంతో వందలాది మంది ఇందుల్లో సభ్యులుగా చేరారు. ప్రతినెల కొంత సొమ్మును చెల్లిస్తూ వస్తున్నారు. ఇలా చెల్లించిన వారికి ఇటు డబ్బులు, అటు ద్విచక్రవాహనం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి దుకాణం వద్దకు వెళ్లారు. వారు అప్పటికే దుకాణం ఖాళీ చేసి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ జన్నారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జన్నారం ఎస్సై పి.సత్య నారాయణను వివరణ కోరగా ధనలక్ష్మీ మోటార్స్‌ నిర్వాహకులు సంపత్‌ , ఆనంద్‌లపై ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని అన్నారు. రూ.20 లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.