స్టాక్ మార్కెట్ ఢామాల్
– భయపడాల్సిన పనిలేదు
– రఘురామరాజన్
ముంబై,ఆగస్ట్ 24 (జనంసాక్షి) : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా కుప్పకూలాయి. బ్లాక్ మండేగా నిలిచి భారీ నష్టాలను తీసుకుని వచ్చింది. ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారిగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. దాదాపు సోమవారం ఒక్కరోజే మదుపర్ల సంపద రూ.7లక్షలకోట్లకు పైగా ఆవిరైపోయినట్లు సమాచారం. ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతోనే ముగిశాయి. ఆగస్టు 24, 2015 స్టాక్‌మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండేగా మిగిలిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,624 పాయింట్లు నష్టపోయి 26వేల దిగువకు పడిపోయింది. చివరకు 25,741 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిప్టీ 490 పాయింట్లు కోల్పోయి 7809 వద్ద ముగిసింది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్‌కు శరాఘాతంలా తగిలింది. దీంతో సెన్సెక్స్ ఏడేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ప్రభావంతో మదుపర్లతో పాటు పెద్ద కంపెనీల షేర్లు కూడా ఢమాలున పడిపోయాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ అమాంతంగా పెరిగింది. ఇక బంగారం ధర మరింతగా పైపకి పోయి మూడునెలల గరిష్టానికి చేరుకుంది. బ్యాంకులు, లోహ, సహజవాయువు, ముడి చమురు షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎండీసీ సంస్థ షేర్లు లాభపడగా వేదాంత, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కైర్న్ ఇండియనా, గెయిల్, ఓఎన్‌జీసీ సంస్థల షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ షేర్లు 9నుంచి 15 శాతం మేర నష్టపోయాయి. బంగారం షేర్లు మాత్రం పర్వాలేదనిపించాయి. ప్రపంచ మార్కెట్ల సంక్షోభం కారణంగానే మార్కెట్లు పడిపోయాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు సవిూక్షిస్తుందని ఆయన చెప్పారు. గత కొద్దిరోజులుగా ప్రపంచ మార్కెట్లలో సంక్షోభం నెలకొందని, దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడిందని ఆయన అన్నారు.చైనా ఆర్థిక వ్యవస్థ కారణంగానే మన స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్ తెలిపారు. భయపడాల్సిన పని లేదన్నారు. స్టాక్‌మార్కెట్ల పతనంపై ఆయన ముంబయిలో ప్రకటన చేశారు. చైనా ప్రభుత్వం యూరోను కుదించడంతోనే అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లపై ప్రభావం పడిందని వివరించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక బలోపేతానికి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమన్నారు. ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతోందని… ప్రాజెక్టులను మరింత వేగంగా చేపట్టాల్సి ఉందని రఘురామ్ రాజన్ అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించారు. రిజర్వుబ్యాంకు ప్రభుత్వంతో కలిసే పనిచేస్తుందని స్పష్టం చేశారు. చైనా ఆర్థికవ్యవస్థ ప్రభావంతోనే మన స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
మన మార్కెట్లు కొంతకాలం బలహీనంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడం, వర్షాభావ పరిస్థితులు, వడ్డీరేట్లు అందుబాటులోకి రాకపోవడం తదితర కారణాలు మార్కెట్ల పతనానికి కారణంగా పేర్కొన్నారు. సెన్సెక్స్ ఏకంగా ఏడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఈరోజు మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్‌డేగా నిలిచింది. స్టాక్‌మార్కెట్ల పతనంతో మదుపర్లు ఈ ఒక్కరోజే సుమారు రూ.7లక్షల కోట్లకు పైగా నష్టపోయారని అంచనా వేశారు. ఇదిలావుంటే బంగారం ధర వరుసగా 14వ రోజూ పెరిగి మూడు నెలల గరిష్ఠానికి చేరింది. 150 రూపాయలు పెరగడంతో పదిగ్రాముల పసిడి ధర రూ.27,575కి చేరింది.ప్రపంచ మార్కెట్ల ప్రభావం, సీజనల్ డిమాండుతో కొనుగోళ్లు వూపందుకోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోతుండటం తదితర కారణాల వల్ల ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,158 అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే వెండి ధరలు తగ్గాయి. రూ.300 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,300కి చేరింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.14 అమెరికన్ డాలర్లుగా ఉంది. కొనుగోళ్లు తగ్గడం వల్ల ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత కొన్ని వారాలుగా మార్కెట్‌లో ఉల్లి ధర పైపైకి పరుగు పెడుతుండటంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది. ఉల్లిపాయల ధరలు ఇప్పటికే ఢిల్లీలో కిలో రూ .80కి చేరగా, త్వరలో రిటైల్ మార్కెట్ లో కిలో 100 రూపాయలు పలికే అవకాశం ఉంది..ప్రభుత్వం కనీస ఎగుమతి ధర పెంచితే, అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ ఉల్లి ధర పెరిగి, ఎగుమతులను తాత్కలికంగా నియంత్రించి దిగుమతులు పెంచుకోవటం ద్వారా దేశీయ సరఫరా పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు అటువంటి చర్యలేవి తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. ఉల్లిపాయల ధరలు ఇప్పటికే ఢిల్లీతో సహా పలు రాష్టాల్ల్రో కిలో రూ .80కి చేరగా, పప్పుల ధరలు కూడా గత మూడు వారాల్లో గణనీయంగా పెరిగాయి. ఉల్లి పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్.. రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల నాసిక్ లోని లసాల్ గావ్ టోకు మార్కెట్లో తగినంత సరఫరా తగ్గడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంట దిగుబడి తక్కువగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణం. ధరలు ఒక్కసారిగా ఊహించని విధంగా పెరిగిపోవడం ప్రజలను కలవరపరుస్తుండటం.. మరోపక్క వ్యాపారులు, స్టాకిస్ట్ దళారులు కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నియంత్రనకు చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.