స్టేజ్‌ -3 కిడ్నీ బాధితులకూ పెన్షన్లు

– ప్రతీ 500 మంది డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా హెల్త్‌ వర్కర్లు
– ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
– పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన సీఎం
శ్రీకాకుళం, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్‌ 3 నుంచే పెన్షన్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్‌ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హావిూ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆసుపత్రికి సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తమ పార్టీని 151 స్థానాల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హావిూని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్‌ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని, నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్దానం ప్రాంతమంతా మంచినీటి తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పలాస, ఇచ్చాపురం మొత్తం అన్ని గ్రామాల్లో నేరుగా ఇంటి వద్దకే తాగునీటిని అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నానని జగన్‌ తెలిపారు. పాదయాత్ర సమయంలో హావిూ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 1500 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జీడితోట హెక్టారుకు పరిహారాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే చెక్కుల పంపిణీ మొదలవుతుందని జగన్‌ వెల్లడించారు. 2020 ఏప్రిల్‌ నుంచి క్వాలిటీ బియ్యాన్ని అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అందించిన బియ్యం నాణ్యత లేకపోవటంతో మళ్లీ ఆ బియ్యాన్ని రేషన్‌ డీలర్లకే విక్రయించేవారని, కానీ మా ప్రభుత్వంలో అలాంటి సమస్య లేకుండా సోనా మసూరి బియ్యాన్నే అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 80శాతం సన్నబియ్యాన్ని అందిస్తామని, 2020 ఏప్రిల్‌ తరువాత 100శాతం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు సరఫరా చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని..అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు గ్రామ వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. వీరికి రూ. 5 వేల వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు..ఇప్పటికే పలు పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని జగన్‌ తెలిపారు.