స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం

` మరోసారి కులగణన సర్వే చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో వాయిదా పడే అవకాశం
` న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు
` రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగుల్లాలు
` అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత కానరావడం లేదు. ఓ వైపు సవిూక్షలు చేస్తుంటే..మరోవైపు మళ్లీ కులగణకు అవకాశం ఇవ్వండతో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆసల్యం తప్పదన్న భావన కూడా ఉంది. ఈనెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని భావించారు. కానీ, స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. 96.9శాతం అంటే3.50 కోట్ల మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1శాతం అంటే 16లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు. అయితే ఈ లెక్కల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికలను వెంట వెంటనే నిర్వహించనుందని సమాచారం. ఎన్నికలకు సన్నద్ధతపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల కమిషన్‌ అధికారులతో సవిూక్షలు నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవలే ప్రకటించింది. ముందుగా సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌ పెట్టే అవకాశం ఉంది. తాజాగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో పంచాయతీ ఎన్నికలపై సీఎస్‌ శాంతి కుమారి, పంచాయతీరాజ్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన వెంటనే షెడ్యూల్‌ రిలీజయ్యే అవకాశం ఉంది. 42శాతం సీట్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో పాత పద్ధతినే అమలు చేస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు యాభైశాతం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను సమావేశపర్చి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలో అది సాధ్యం కాదని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఒక అడుగు ముందుకు వేసింది. తమ పార్టీ 42శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ ఇటీవలే రైతు భరోసా మొత్తాన్ని కర్షకుల ఖాతాల్లో జమ చేసింది. బీసీ కులగణన చేపట్టి 56 శాతం వెనుకబడిన వర్గాల వారున్నారని తేల్చింది. వారికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డంకులున్న దృష్ట్యా పార్టీగా ప్రకటిస్తామని వివరించింది. ముందుగా పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఏక గ్రీవాలు అధికంగా చేయడం ద్వారా మెజార్టీ పంచాయతీలను హస్తగతం చేసుకోవాలని భావించింది.ఈసీ నోటా అంశాన్ని తెరవిూదకు తేవడంతో కొంత ఇబ్బంది పడ్డ కాంగ్రెస్‌.. ఇవాళ నిర్వహించిన ఆల్‌ పార్టీ విూటింగ్‌ లో ఒకే అభ్యర్థి బరిలో ఉంటే నోటాతో పోటీ పెట్టే అంశాన్ని వ్యతిరేకించింది. గెలిచిన సర్పంచులు.. అభివృద్ధి కోసం తమ పార్టీలో చేరుతారని భావిస్తోంది. వారిని చేర్చుకొని వాళ్ల అండతో ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యే అవకాశ ఉంది. ఇలా చేయడం ద్వారా మెజార్టీ మండలాల్లో పాగా వేయొచ్చన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా షెడ్యూల్‌ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బీసీలకు కొంచం తక్కువ 23 శాతం సీట్లను కేటాయించనుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీలకు 28శాతం స్థానాలను కేటాయించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై న్యాయ సవిూక్ష జరిగిన తర్వాత ఎలాంటి ఆటంకాలు రావని నిర్దారించుకున్న విూదటే షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.