స్పష్టత పేరిట టీడీపీ మహా మోసం

తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ ఇంతకాలం మోసం చేస్తూ వస్తోందా? ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తాజా ప్రకటనతో ఇది నిజమేనని తేలిపోయింది. త్వరలో జరగనున్న మహానాడులో తెలంగాణ అంశంపై స్పష్టత ఇస్తామని ఎర్రబెల్లి మీడియాకు చెప్పడం ఇందుకు బలం చేకూర్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటూ ఆ పార్టీ తెలంగాణప్రజలను మోసగించినట్లుగా ఎర్రబెల్లి మాటలు చెప్పకనే చెప్పాయి. వరుస ఆత్మబలిదానాలతో తెలంగాణ అల్లకల్లోమయినా, విద్యార్థులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని కాలి మసైపోయినా, ఇలా ఒక్కొక్కరుగా సమిధలవుతున్నా టీడీపీ పట్టించుకోకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ బిడ్డల చావులకు కారణమవుతున్న తెలంగాణ అంశంపై టీడీపీ తన నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించదు? వైఖరి వెల్లడించని కారణంగానే జరిగిన తెలంగాణ బిడ్డల చావులకు తెలుగుదేశం పార్టీ ఎందుకు బాధ్యత వహించదు? ఈ చావుల పాపం ముమ్మాటికీ టీడీపీదే, ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులదే. ఆత్మహత్యలకు కారణమైన రాజకీయ పార్టీల అధినేతలు ఇప్పుడు సంతాపాలు ప్రకటించడం మరీ విడ్డూరం. తెలంగాణ అంశంపై టీడీపీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేస్తూ వచ్చారు.తెలంగాణపై టీడీపీ వైఖరిని చెప్పాలంటూ తెలంగాణ ప్రజలు నిలదీసినప్పుడల్లా తెలుగుతమ్ముళ్లు ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖలో టీడీపీ వైఖరిని స్పష్టం చేశాం కనుక మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.తెలంగాణకు వ్యతిరేకం కాదని వెయ్యిన్నొక రాగంతో చెబుతున్న చంద్రబాబు తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని ఒక్క ముక్క రాసి కేంద్రానికి ఎందుకు పంపించడం లేదు? ఎన్నికల సమయంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం, ఎన్నికల తర్వాత అందుకు భిన్నంగా మాట్లాడటం టీడీపీ తదితర సమైక్యవాద పార్టీలకు రివాజుగా మారింది.
ఇప్పటికైనా తెలంగాణ తముళ్లు కళ్లు తెరవాలి. చంద్రబాబునాయుడు మోసపూరిత వైఖరిని గ్రహించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు చేత చెప్పించాలి. ఈ పని చేయించకుంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ తమ్ముళ్లను నమ్మరు. ఇంకా చంద్రబాబుపై భ్రమల్లో ఉంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. చంద్రబాబునాయుడుపై ఈగ వాలితే ఒంటికాలిపై లేవడమే కాకుండా ఆయనకు అడుగడుగునా అండగా నిలిచిన నాగం జనార్దన్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జ్ఞానోదయమై బాబును వీడిన విషయాన్ని తెలంగాణ తముళ్లు గ్రహించాలి. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాగం అండ్‌ కో ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారనే విషయాన్నీ అర్థం తెలుసుకోవాలి. ఇప్పటికైనా మేల్కొని తెలంగాణకు సానుకూలంగా టీడీపీ వైఖరిని బాబుచేత చెప్పించాలి. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలకు ఇదే ఆఖ్రీ మౌఖా.

తాజావార్తలు