స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డి


– ఏకగ్రీవమైన  స్పీకర్‌ ఎన్నిక
– పోచారంను స్పీకర్‌ చైర్‌ వరకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్‌, ఉత్తమ్‌, ఈటెల
– ఏకగ్రీవం చేసిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌ స్థానంకు కేసీఆర్‌ సూచనలతో శ్రీనివాస్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా అన్ని పార్టీలు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు ఇవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం సభలో అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌ చైర్‌లో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్‌ కోరారు. దీంతో వెంటనే పోచారం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. పోచారంను  సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లు ఆయనను స్పీకర్‌ స్థానం వరకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారందరికి పోచారం, కేసీఆర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
ఊరిపేరే ఇంటి పేరుగా…
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.