స్వగ్రామానికి చేరిన కలాం పార్థీవ దేహం

C

– కడసారి చూపుకు క్యూ కట్టిన రామేశ్వరం

– కన్నీరు పెడుతున్న చిన్ననాటి స్నేహితులు

చెన్నై/న్యూఢిల్లీ,జులై29(జనంసాక్షి): మాజీరాష్ట్రపతి అబ్దుల్‌కలాం స్వగ్రామం కన్నీరు పెడుతుంది. ఆయనను కడసారి చూసేందుకు ఆబాలగోపాలం క్యూకట్టారు. కలాం స్నేహితులు ఇప్పుడు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయనతో తమకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని వేదన చెందుతున్నారు.  నింగికెగసిన మహా మనిషి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిన్నప్పుడు పైలట్‌ లేదా ఏరోనాటికల్‌ఇంజినీర్‌ అవ్వాలని కలలుగనేవారని,. ఆయనతో పాఠశాలలో కలిసి చదువుకున్న ఆయన స్నేహితుడు సంబిత్‌  రామేశ్వరంలో  విూడియాతో అన్నారు. ‘ఆయన ఒకటి తలిస్తే.. భగవంతుడు ఒకటి తలచాడు. ఇంజనీరు కావాల్సిన కలాం శాస్త్రవేత్త అయ్యారు. దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఆయనకు విద్యార్థులంటే ఎంతో ఇష్టం. ఆయన చివరి శ్వాస విడిచేవరకు వారి కోసమే బతికారు’ అంటూ కలాంతో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇక అబ్దుల్‌ కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యాక కూడా ఎంతో నిరాడంబరంగా ఉండేవారని ఆయన బాల్య స్నేహితుడు వెంకట సుబ్రహ్మణియన్‌ శాస్త్రి అన్నారు. వందేళ్లు బతుకుతాడనుకున్నానని ఈలోపే ఆయన మరణించడం తనని కలచి వేసిందని కన్నీరు పెట్టుకున్నారు. కలాం భౌతికకాయం తమిళనాడులోని ఆయన స్వగ్రామం రామేశ్వరానికి చేరుకున్న నేపథ్యంలో సుబ్రహ్మణియన్‌ ఆయనతో గల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ‘ఎప్పుడు రామేశ్వరం వచ్చినా మా ఇంటికి వచ్చేవాడు. మా ఆరోగ్యం బాగోగుల గురించి అడిగి తెలుసుకునేవాడు. నాతో ఫొటోలు తీసుకునేవాడు. రాష్ట్రపతి అయ్యాక కుండా ఎప్పటిలాగే అంతే నిరాడంబరంగా ఉండగలిగాడు. ఓ సారి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను దిల్లీ వెళ్లాను. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యుల గురించి, నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు’ అంటూ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహం దిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కలాం పార్థివదేహాన్ని ముందుగా 10 రాజాజీమార్గ్‌లోని కలాం నివాసం నుంచి పాలం విమానాశ్రయానికి రక్షణశాఖ అధికారులు తరలించారు. అక్కడ గౌరవ వందనం చేసిన అనంతరం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కేంద్రమంత్రులు వెంక్యనాయుడు, మనోహర్‌ పారికర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం పార్థివదేహంతో పాటే తమిళనాడు వెళ్లారు. దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 8 గంటలకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కలాం పార్థివదేహంతో మధురై బయలుదేరి వెళ్లింది. మధురైలోకలాం పార్థివదేహానికి తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశకన్‌ నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రామేశ్వరం తరలించనున్నారు. రామేశ్వరానికి తరలించాక అక్కడ రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ప్రజలకు అనుమతిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంతిమ సంస్కార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.

అంత్యక్రియలకు దూరంగా జయ

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంత్యక్రియలకు హాజరు కావడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నప్పటికీ.. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని స్పష్టం చేశారు. తన తరఫనె పన్నీర్‌ సెల్వం సహా ఇతర మంత్రులందరూ హాజరవుతారని పేర్కొన్నారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో సత్సంబంధాలున్న జయలలిత, ఆయన్ని రాష్ట్రపతి పదవిలో రెండవసారి చూడాలని ఎంతో కోరుకున్నారు. అయితే, అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం.. దానికి తోడు కేంద్ర రాష్ట్రాల చట్టసభల్లో బిజెపి, జయ కూటమికి తగినంత బలం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాను ఆనారోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. ఇంతకుముందు ప్రతిపక్ష నేతలు జయ ఆనారోగ్యంపై వ్యాఖ్యానించినప్పుడు అన్నా డిఎంకె  నేతలు తీవ్ర విమర్శలు చేసేవారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం బౌతిక కాయానికి అంత్యక్రియల సందర్బంగా జయలలిత కూడా సహజంగా అయితే రామేశ్వరం వెళ్లవలసి ఉంటుంది. కాని ఆమె ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ తనకు కలాం అంటే ఎంతో గౌరవమని అన్నారు.

కలాం మృతికి సంతాప సూచకంగా గురువారం సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. స్థలాన్ని కూడా కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ తో సహా పలువురు నేతలు హాజరు అవుతున్నారు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య కూడా వెళుతున్నారు.

కలాం మృతికి ఒబామా సంతాపం

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం తెలియజేశారు. కోట్లాది మంది భారతీయులతో పాటు ప్రపంచంలో ఎంతో మందిలో అబ్దుల్‌ కలాం స్ఫూర్తిని నింపారని ఒబామా కొనియాడారు. అమెరికా ప్రజల తరఫున భారతీయులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా- భారత్‌ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం చేసిన కృషిని ఒబామా ప్రశంసించారు. ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేసిన మానవతామూర్తి కలాం అని.. అందుకే ఆయన ప్రజా రాష్ట్రపతి అయ్యారని అన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా ఆయన స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ అభిమానం,గౌరవం సంపాదించుకున్నారని అబ్దుల్‌ కలాంను ఒబామా కొనియాడారు.గొప్ప శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా ఆయన స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ అభిమానం, గౌరవం సంపాదించుకున్నారని అబ్దుల్‌ కలాంను ఒబామా కొనియాడారు. ఇదిలావుంటే వివిధ దేశాల్లో పత్రికలు కలాం మృతిని ప్రముఖంగా ప్రచురించాయి. ఆయన గొప్ప దార్శనికుడని కీర్తించాయి. పలు దేశాల నేతలు కలాం మృతికి నివాళి అర్పించారు.

కేరళ సాంకేతిక విశ్వవిద్యాలయానికి కలాం పేరు: సిఎం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జ్ఞాపకార్థంగా కేరళ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టనున్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ అసెంబ్లీలో ప్రకటించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో కలాం విశేష కృషి చేశారని, ఆయన జ్ఞాపకార్థంగా విశ్వవిద్యాలయాన్ని కలాం యూనివర్శిటీగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌, మంత్రులు, ప్రతిపక్షాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాందీ పేర్కొన్నారు. కలాం భౌతికకాయాన్ని కేరళ తీసుకురావాల్సిందిగా తాను కేంద్రాన్ని కోరారని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కుదరలేదన్నారు. కేరళతో కలాంకు అనుబంధం విడదీయరానిదని చాందీ గుర్తుచేశారు.

పుస్తకరూపంలోకి కలాం చివరి ప్రసంగం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పూర్తిచేయలేని చివరి ప్రసంగాన్ని పుస్తక రూపంలో తీసుకొస్తామని ఆయన సన్నిహితుడు శ్రీజన్‌పాల్‌ సింగ్‌ అన్నారు. అబ్దుల్‌కలాం గత సోమవారం షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయి, అనంతరం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అంశం ‘క్రియేటింగ్‌ ఏ లివబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌’ అనేది కేవలం ఓ ప్రసంగం కాదని శ్రీజన్‌పాల్‌ తెలిపారు. కలాం ఆ అంశంపై పుస్తకం కూడా రాస్తున్నారన్నారు. దాదాపు సగం వరకు ఆ పుస్తకాన్ని పూర్తిచేశారని, మిగతా సగం త్వరలోనే పూర్తి చేయాలనుకునేవారని శ్రీజన్‌పాల్‌ గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనే మనల్ని విడిచివెళ్లిపోయారని, కలాం ఆశయాన్ని తాము పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఎలాగైనా మిగతా సగం ప్రసంగాన్ని ఆ పుస్తకంలో రాసి విడుదల చేస్తామన్నారు.