స్వచ్ఛందంగా ఆస్తులు వెల్లడించండి

5

– ఇదే చివరి అవకాశం

– పన్ను ఎగవేతదారులకు మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి): అప్రకటిత ఆస్తులను సెప్టెంబర్‌ 30లోగా స్వచ్ఛందంగా ప్రజలు వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారంనాడు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆల్‌ ఇండియా రేడియాలో ప్రధాని ప్రసంగించారు. స్వచ్ఛందంగా అప్రకటిత ఆస్తులు వెల్లడించే చిట్టచివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల గడువు తర్వాత ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చని ఆయన సూచించారు. స్వచ్ఛందంగా డిక్లరేషన్‌ ఇచ్చినట్లయితే ఇంతవరకూ వెల్లడించని ఆస్తులు, లేదా ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని వివరించారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని సెప్టెంబర్‌ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిందన్నారు. పెనాల్టీ కట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా చేసుకోవచ్చని ప్రధాని సూచించారు. ‘గడవులోగా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఆ ఆస్తి ఎక్కడదని ఎవరూ ప్రశ్నిచరని నేను హావిూ ఇస్తున్నారు. జవాబుదారీ వ్యవస్థలో భాగమయ్యేందుకు ఇది ఒక సదవకాశం’ అని ఆయన అన్నారు. ఇదే చిట్టచివరి అవకాశమని కూడా ఆయన స్పష్టం చేశారు. పన్ను నిబంధనలను ఉల్లంఘించడం వల్ల మనం అశాంతికి గురికావాల్సి వస్తుందని, చిన్న వ్యక్తికి కూడా మనం భయపడాల్సి వస్తుందని, అలా ఎందుకు జరగాలని ప్రధాని ప్రశ్నించారు. మన సంపద గురించిన సరైన సమాచారం ఇచ్చినప్పుడు ఇలాంటి సమస్యలుండవని ఆయన దేశప్రజలకు పిలుపునిచ్చారు.