స్వదేశీ తొలి శిక్షణ విమానాన్ని ప్రారంభించిన పారికర్‌

4

బెంగళూరు,జూన్‌ 17(జనంసాక్షి): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి శిక్షణ విమానం హిందుస్థాన్‌ టర్బో ట్రైనర్‌-40 (హెచ్‌టీటీ-40) భారత వైమానిక దళంలోకి చేరింది. రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమాన సేవల్ని ప్రారంభించారు. హెటీటీ-40 విమానాన్ని హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ రూపొందించింది. 2013 ఆగస్టులో హెచ్‌టీటీ-40 డిజైన్‌ పూర్తయిందని, 2015 మే నాటికి విమాన తయారీ పూర్తయ్యే విధంగా హెచ్‌ఏఎల్‌ నిధులు కేటాయించిందని అధికారులు పేర్కొన్నారు. అయితే తొలి విమాన నిర్మాణం పూర్తవ్వడానికి దాదాపు ఏడాది ఆలస్యమైందని తెలిపారు. దాదాపు 70 హెచ్‌టీటీ-40 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని భారత వైమానిక దళం భావిస్తున్నది. 2018లోగా ఈ విమానాల ఆపరేషన్‌కు క్లియరెన్స్‌ లభించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు హెచ్‌ఏఎల్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మూడు ప్రొటోటైప్‌, రెండు నమూనా విమానాలను తయారు చేస్తున్నది. దీని బరువు సుమారు 2800 కేజీలు. 950 ఎస్‌హెచ్‌పీ సామర్థ్యమున్న టర్బో ప్రాప్‌ ఇంజిన్‌ను హెచ్‌టీటీ-40 విమానాన్ని రక్షణదళంలోని మూడు విభాగాల క్యాడెట్లు ఉపయోగించేలా డిజైన్‌ చేశారు.