స్వల్ప ఘటనలు మినహా.. నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ప్రశాంతం

తుపాకీ నీడన పోలింగ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి మూడు గంటల్లోనే నాగాలాండ్‌లో 30 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా శనివారం 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి చుబాచాంగ్‌ శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందడంతో తీన్‌సంగ్‌ సదర్‌ నియోజకవర్గం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆదివారం ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా చెదురుమదురు ఘటనలు మినహా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న నియోకవర్గాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 230 కంపెనీల రాష్ట్ర బలగాలు, 255 కేంద్ర కంపెనీల బలగాలను మోహరించారు. మొత్తం 188 మంది బరిలో ఉండగా.. వీరిలో 39 మంది స్వతంత్రులు. అధికార నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 60 స్థానాలకు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ 57, ఎన్‌సీపీ 15, బీజేపీ 11, జేడీయూ3 ఆర్జేడీ ఒక స్థానం నుంచి బరిలో ఉన్నాయి. 11.93 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక, మేఘాలయలో ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఉదయంనుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం మందకొడిగా కొనసాగిన ఓటింగ్‌.. ఆ తర్వాత జోరందుకుంది. తొలి రెండు గంటల్లో కేవలం 11 శాతమే పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత జోరుగా సాగింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా బలగాలను మోహరించారు. సరిహద్దు భద్రతా బలగాలతో పాటు స్తానిక పోలీసులను రంగంలోకి దించారు. హెఎన్‌ఎల్‌సీ బంద్‌కు పిలుపునివ్వడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘాను ముమ్మరం చేశారు. 60 స్థానాలున్న మేఘాలయలో 345 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ అన్ని చోట్ల పోటీ చేస్తుండగా.. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మాకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నుంచి 32, ఎన్సీపీ 21, బీజేపీ 13 చోట్ల బరిలో ఉన్నాయి