స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ 

ముంబయి, జులై13(జ‌నం సాక్షి) : దేశీయ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గురువారం భారీ లాభాలతో జీవన కాల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌ ఉదయం కూడా దాదాపు వంద పాయింట్ల లాభంతో సానుకూలంగానే ప్రారంభమైంది. నిఫ్టీ కూడా ఉదయం 11వేల మార్కు పైనే ట్రేడయ్యింది. తర్వాత కూడా లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరకు వచ్చేసరికి స్వల్పంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.78 పాయింట్ల నష్టంతో 36541.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 4.30 పాయింట్ల నష్టంతో 11018.90 పాయింట్లకు చేరింది. ఉదయం డాలరుతో రూపాయి మారకం విలువ కూడా బలపడటం ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.49 వద్ద ట్రేడవుతోంది. ఫెనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా తదితర రంగాల షేర్లు నష్టపోగా, ఐటీ, ఎనర్జీ తదితర రంగాల షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌ కంపెనీ, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంకు, ఐటీసీ తదితర కంపెనీల షేర్లు నష్టాల పాలయ్యాయి.