హంతకులను అప్పజెప్పకుండా ఇటలీ రాయబారి దేశం వీడొద్దు

సుప్రీం సంచలన ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 14 (జనంసాక్షి): ఇటలీ రాయబారి డేనియల్‌ మాన్సీని భారతదేశం నుంచి వెళ్లనీయకుండా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ తీరంలో ఇటలీ నావికాధికారులు ఇద్దరు కేరళ మత్స్యకారులను కాల్చి చంపిన ఘటన కేసులో ఇటలీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటలీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరిగా లేదని, సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరిని భారత్‌కు పంపాలని కోరింది. అదే విధంగా భారత్‌ను వీడిందేకు యత్నిస్తున్న ఇటలీ రాయబారిని అడ్డుకోవాలని కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను హత్య చేసిన కేసులో ఇద్దరు ఇటలీ నాయకులు భారత్‌లో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీరిరువురూ కొన్ని రోజుల క్రితం క్రిస్మస్‌ పండుగ ఉందని పెరోల్‌పై స్వదేశమైన ఇటలీకి వెళ్లి   తిరిగి వచ్చారు. మళ్లీ ఇటలీలో సాధారణ ఎన్నిక జరుగుతున్నందునా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరగా వారిద్దరూ అక్కడికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 22న అనుమతి మంజూరు చేసింది. నాలుగు వారాల్లోగా విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని గడువు విధించింది. సుప్రీంకోర్టు అనుమతితో ఇటలీ వెళ్లిన మాసిమిలియానో లాటోరే, సాల్వెటోరేగిరో అనే ఈ నావికులు ఈ నెల 22 తేదీనాటికి భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. కాని వారిని తిరిగి భారత్‌కు పంపేది లేదని ఇటలీ తేల్చి చెప్పడంతో వివాదం రాజుకుంది.  దీనిపై ప్రధాని సైతం జోక్యం చేసుకుని పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఘాటైన పదజాలంతో ఒక  ప్రకటన చదవి వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం నావికులను తిరిగి పంపకుంటే రెండు దేశాల మధ్య ఉన్న  ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర పరిణామాలను చవిచూస్తారని ఇటలినీ హెచ్చరించారు. మరో వైపు దౌత్యపరమైన మార్గాల్లోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఇటలీ రాయబారి ఆశాభావం వ్యక్తం చేస్తూ దేశాన్ని వీడి వెళ్లాలంటూ తనకు ఆదేశాలు వచ్చేంతవరకు దేశాన్ని వీడి వెళ్లనని చెప్పారు. మరో వైపు ఇటాలియన్‌ నావికుల వ్యవహారంపై బీజేపీ మండిపడుతూ ఇలాంటి చర్య మరోసారి ఇటలీ పునరావృతం చేసిందని, భారత్‌ ఇక దౌత్య మర్యాదను పాటించకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం ఉన్నా వారిని స్వదేశానికి వెళ్లేందుకు ఎలా అనుమతించారని బీజేపీ ప్రశ్నించింది.