హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైన ఆధారాలు లేవ్‌

– భారత్‌తో మైత్రి కొనసాగుతుంది
– పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
ముంబయి 26/11 దాడికి కుట్రదారుగా భారత్‌ పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైనా ఆధారాలు లభించలేదని పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ పేర్కొన్నారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. గత సెప్టెంబర్‌లో జరిగిన వీసా అగ్రిమెంట్‌ ఒప్పందంపై చర్చించి సంతకం చేసేందుకు తాను భారత్‌కు వచ్చానని తెలిపారు. ముంబయి దాడుల కేసులో పాకిస్థాన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భారత హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్‌తో తమ దేశం మైత్రి కొనసాగిస్తుందని తెలిపారు.