హరికృష్ణ పార్దివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
– కుటుంబ సభ్యులకు ఓదార్పు
హైదరాబాద్, ఆగస్టు29(జనం సాక్షి) : రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించి నివాళులర్పించారు.
చంద్రశేఖర్ రావు.. హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌ను కేసీఆర్ పరామర్శించారు. సీఎం చంద్రబాబుతో కాసేపు మాట్లాడారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని తదితరులు ఉన్నారు. నందమూరి హరికృష్ణతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హయాంలో ఇరువురూ కలిసి టీడీపీలో పనిచేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హరికృష్ణ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే శాఖను నిర్వహించడం గమనార్హం. హరికృష్ణ అంత్యక్రియలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి హరికృష్ణ కుటుంబసభ్యులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.
——————————-



