హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్
వరంగల్,జూలై3(జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్ తరాలకు పర్యావరణ సమతుల్యత అందించాలంటే హరితహారమే మార్గమన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు.
రైతులకు ఉపాధి హావిూ పథకంలో భాగంగా మొక్కలను అందించాలని అన్నారు. రైతులు పొలం గట్లపై మొక్కలను పెంచుకోవాలన్నారు. టేకు, ఎర్రచందనం వంటి విలువైన మొక్కలను పెంచుకుంటే ఆర్థికంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను హరితహారంలో అగ్రభాగాన నిలపాలన్నారు. గతంలో తాతలు, తండ్రుల పేర్లవిూద భూమి ఉండి వారు చనిపోతే వాటిలో వారసుల పేర్లు నమోదు చేయాలన్నారు. 100 శాతం ఓడీఎఫ్ గ్రామాలుగా పూర్తి చేసుకున్న చోట్ల గ్రామాభివృద్ధికి నిధులను సమకూర్చుతామని చెప్పారు. చాలా గ్రామాలు 100 శాతం ఓడీఎఫ్ సాధించాయన్నారు. గ్రామాల్లో వెంటనే శ్మశానవాటిక, డంపింగ్ యార్డు పనులను చేపట్టాలని సూచించారు.