హరితహారంలో వందశాతం అంకితభావం ఉండాలి
అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్దికి చర్యలు
ప్రకృతి పునరుజ్జీవనానికి కృషి చేయాలి
అధికారులతో సవిూక్షలో చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి
హైదరాబాద్,జనవరి23((జనంసాక్షి): హరితహారం పేరుతో నాటుతున్న మొక్కలు, అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రకృతి పునరుజ్జీవనం కిందకు వస్తాయని, ఇందులో పాల్గొనే శాఖలు, సిబ్బంది వందశాతం కమిట్‌మెంట్ తో పనిచేయాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి పిలుపునిచ్చారు. ఈయేడాది వర్షాకాలంలో మొదలు పెట్టాల్సిన ఐదవవిడత హరితహారం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత తరంలో పాటు, రానున్న తరాలు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలన్న మంచి ఆశయంతో ముఖ్యమంత్రి తెలంగాణకు హరితహారం మొదలుపెట్టారని, దానిని విజయవంతం చేయాల్సిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. అందుకే ఈయేడాది వంద కోట్ల మొక్కలు నాటే భారీ లక్ష్యాన్ని సీ.ఎం పెట్టారని అందుకనుగుణంగా శాఖలు, ఉద్యోగులు పనిచేయాలన్నారు. అటవీ శాఖతో పాటు హరితహారం సంబంధిత శాఖల ఉన్నతాధి కారులతో కూడిన స్టీరింగ్ కమిటీలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతి, కొత్తగా పంచాయితీకి ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటు, పెంచాల్సిన మొక్కలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అటవీ, పంచాయితీ రాజ్, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో నర్సరీల సంఖ్య పెంచటం, వంద కోట్ల మొక్కల పెంపకంపై శాఖల వారీగా చీప్ సెక్రటరీ ఆరాతీశారు. తెలంగాణ వాతావరణం, భూములకు అనుకూలమైన మొక్కలు నాటితేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, ఇండ్లలో పెంచే మొక్కలకు ఈ సారి అధిక ప్రాధాన్య తను ఇస్తూనే, నీడ, పండ్లనిచ్చే జాతి మొక్కలపై దృష్టి పెట్టాలన్నారు. రహదారుల వెంట నాటే పెద్ద మొక్కలను అటవీ శాఖ ప్రత్యేకంగా పెంచాలని సూచించారు. 12, 751 గ్రామ పంచాయితీలకు గాను,
ఇప్పటికే 2,206 గ్రామాల్లో అటవీ శాఖ నర్సరీలు ఉన్నాయని, మిగతా 10,545 పంచాయితీల్లో 9,868 పరిధిల్లో నర్సీరీల ఏర్పాటు వేగవంతం అయిందని పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. అలాగే ప్రతీ పట్టణ ప్రాంతంలో కూడా వార్డులు, డివిజన్ కు ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటు పూర్తికావాలని, పెరిగిన కాలుష్య కారకాలను తట్టుకునేందుకు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు ఐదో విడతలో అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ చెప్పారు.
అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సవిూక్ష
/ూజధాని చుట్టుపక్కల తొలివిడతలో ఏర్పాటు చేస్తున్న 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. పనుల పురోగతిపై ఏజెన్సీల వారీగా చీఫ్ సెక్రటరీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి జూలైలో అర్బన్ పార్కులను ప్రారంభించాలన్న డెడ్ లైన్ పెట్టారని, అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. టెండర్లు, అనుమతుల పేరుతో పనుల్లో జాప్యం వద్దన్నారు. అటవీ ప్రాంతాల్లో తగిన పౌర వసతులతో పార్కులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అంతే విధంగా మిగతా అటవీ ప్రాంతాల్లో పునరుజ్జీవన చర్యలను అటవీ శాఖ నేతృత్వంలో చేపట్టాలన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, టూరిజం శాఖల పరిధిలో అభివృద్ది చేయాల్సిన అర్బన్ పార్కుల పనులను వేగవంతం చేయాలని, వచ్చే సమావేశం కల్లా పూర్తి వివరాలతో రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ శ్రీదేవి, టూరిజం సెక్రటరీ దినకర్ బాబు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఆమ్రపాలి, ఈపీటీఆర్‌ఐ డీ.జీ కళ్యాణ్ చక్రవర్తి, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, అటవీ అభివృద్ది సంస్థ ఎండీ ఏకేజైన్, అదనపు పీసీసీఎఫ్ డోబ్రియాల్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎం.డీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.