హవాయి ద్వీపంలో బద్ధలైన అగ్నిపర్వతం

భూకంపంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
లాస్‌ఏంజిల్స్‌,మే5(జ‌నం సాక్షి ): అమెరికాలోని హవాయి ద్వీపంలో అగ్నిపర్వతం బద్ధలై కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున లావా ఎగిసిపడుతోంది. అయితే తాజాగా హవాయి ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.9గా నమోదైంది. ఈ తీవ్రతతో మరోసారి అగ్నిపర్వతం నుంచి లావా ఉబికి వస్తోంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరంగా సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వాయువు విడుదలవుతోంది. దీంతో సవిూపంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.  కిలౌయీ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున పొగలు, లావా, బూడిద ఎగిసిపడుతున్నాయి. దీంతో అత్యవసర సేవల విభాగం అధికారులు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. శుక్రవారం అగ్నిపర్వతం సవిూపంలో 5.3తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో గంట తర్వాత 6.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. అగ్నిపర్వతం నుంచి మరింతగా లావా బయటకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా జియోలాజికల్‌ సర్వే హెచ్చరించింది. లావా ఎగిసిపడి బయటకు ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో రెండు ఇళ్లు కాలిపోయాయి. అగ్నిపర్వతానికి సవిూపంలోని లైలానీ ఎస్టేట్స్‌, లనిపునా గా/-డ్గం/న్స్‌ ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో అత్యవసర స్థితి ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయం చేయాలని హవాయి నేషనల్‌ గార్డ్‌ను సహాయం కోరారు. అగ్నిపర్వతం నుంచి ప్రమాదకర వాయివులు వెలువడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని
అధికారులు ప్రజలకు సూచించారు.
—————