హాకా ద్వారా సోయా కొనుగోళ్లు

ప్రభుత్వం అదనంగా 200 బోనస్‌ చెల్లింపు

ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగసంస్థ హాకా ద్వారా జిల్లాలో సోయా కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌తో పాటు ఇతర మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. కేంద్రం సోయాకు రూ.2850 మద్దతు ధర ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.200 బోనస్‌ చెల్లిస్తోంది. ఫలితంగా రైతులకు క్వింటాకు రూ.3050 ధర లభించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోయాకు వర్షాలు అనుకూలించడం, తెగుళ్లు రాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సోయా కనీస మద్దతు ధరను సైతం పెంచింది. గత ఏడాది క్వింటా ధర రూ.2775 ఉండగా.. రూ.275 పెంచి రూ.2850గా ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.200 బోన స్‌ ప్రకటించడంతో ప్రస్తుతం క్వింటాకు రూ.3050 రైతుకు దక్కుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తక్కువగా వ్యాపారులు సోయాను కొనుగోలు చేస్తుండడంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్‌, జైనథ్‌, బోథ్‌, ఇచ్చో డ మార్కెట్‌యార్డుల్లో హాకా కేంద్రాలను ప్రారంభించి పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్దకు పంటను తీసుకుపోవడం లేదు. ప్రైవేటులో క్వింటాకు రూ.2500 ధర లభిస్తుండగా.. హాకా కేంద్రాల ద్వారా ప్రభుత్వం క్వింటాకు రూ.3050 చెల్లిస్తోంది. హాకా అధికారులు పంటను విక్రయించిన రైతులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు.

ప్రతి సంవత్సరం జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు సోయాను కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం ధర పెంచడం తో వారు సర్కారు ప్రకటించిన ధరకు కొనుగోళ్లు చే యడం లేదు. జిల్లా వ్యాప్తంగా

ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ.2400 నుంచి రూ.2500 చెల్లిస్తున్నా రు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో పంటల అమ్మకాల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా గత నెల 9న పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ప్రైవేటు వ్యాపారులు మార్కెట్‌యార్డుల్లో సీసీఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ఎ క్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. సోయా కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

జిల్లాలో రైతులు వానాకాలంలో ఎక్కువగా పత్తి, సోయాబీన్‌ పంటలను సాగు చేస్తారు. జిల్లాలో పంట సాధారణ సాగు విస్తీర్ణం 38 వేల హెక్టార్లు కాగా.. ఈ సారి 24 వేల హెక్టార్లలో రైతులు పంటను వేశారు.

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు పత్తి పంట సాగు వైపు మొగ్గు చూపారు. ఫలితంగా గత ఏడాది కంటే ఈ సారి పంట సాగు విస్తీర్ణం 10 వేల హెక్టార్ల వరకు తగ్గింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులు పంట ను విక్రయించకుండా అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు. గ్రామాల నుంచి సోయా పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చే రైతులు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణపత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఈ పత్రం ఉంటేనే రైతులు తీసుకొచ్చిన పంటను మార్కెట్‌యార్డులో హాకా సిబ్బంది కొనుగోలు చేస్తారు.