హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర , జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ విమర్శించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు పాల్గొని మాట్లాడారు.ఒకే విడతలో లక్ష రూపాయల రుణమాఫీ,అర్హులైన నిరుపేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.2018 ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు, నిరుద్యోగ భృతి , ఇండ్లు లేని వారికి సొంత స్థలాల్లోనే ఇండ్లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు.ఈ హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు.హుజురాబాద్ ఉప ఎన్నికలకు దళిత బందును ప్రకటించి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గిరిజన బంధు అంటూ మరోసారి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మునుగోడులో అర్హులైన వారందరికీ ఇస్తుంటే,సూర్యాపేటలో వేల మంది అర్హులుంటే,వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఇస్తున్నారన్నారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు లేవని,పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఉద్యోగ భద్రత కల్పించమన్నందుకు ఆర్టీసీ కార్మికులు , ఫీల్డ్ అసిస్టెంట్లు , వీఆర్ఏల ప్రాణాలను టిఆర్ఎస్ ప్రభుత్వం బలి తీసుకుందన్నారు.ధరణి పోర్టల్ తీసుకువచ్చి పచ్చని పల్లెల్లో భూముల పంచాయితీ, గేట్ల పంచాయితీలు పెట్టింది ఈ ప్రభుత్వమేనని అన్నారు.మద్యం ఆదాయం పెంచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉందన్నారు.ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్, కౌన్సిలర్లు పల్సా మహాలక్ష్మి , సలిగంటి సరిత , పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాస్ ఉపేందర్, పట్టణ నాయకులు గుడిసె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.