*హాస్పిటల్ టెండర్లు వెంటనే పిలవాలి* *కార్మికులకు వేతనాల పెంచాలి*
ఆసుపత్రి సూపరిండెంట్ కు మెమొరాండం*
ఏ ఐ టీ యూ సీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ ,శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లకు కొత్త టెండర్లు వెంటనే పిలవాలని ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్ర వారం నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్ సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెమొరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ టెండర్ కాలపరమితి ముగిసి రెండు సంవత్సరాల దాటుతున్న నేటికి కొత్త టెండర్లు పిలవకుండా కాలయాపన చేయడం విచారకరమనీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టెండర్ల కార్యక్రమంలో గందరగోళం నెలకొన్నదని అన్నారు. 550 పడకలు ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పడకల సంఖ్య నిర్ధారించడంలో రాష్ట్రవైద్య అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి కాలపరిమితి ముగిసిన పాత టెండర్లనే కొనసాగించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు ఇస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని మిగతా ఆసుపత్రిలో టెండర్లు వేసినప్పటికీ వాటిని పూర్తి చేసి కొత్త వేతనాలు ఇవ్వడంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని ఆరోపించారు. జీవో నెంబర్ 21 అమలు చేసి పంతొమ్మిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టెండర్లు వెంటనే వేయకపోతే AITUC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దేవేందర్ రెడ్డి తెలిపారు. కార్మికులకు చట్టపరంగా రావలసినటువంటి PF, ఈఎస్ఐ ,ప్రభుత్వ సెలవులు కచ్చితంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ బ్రాంచ్ కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాదగిరి ,పద్మ, మౌలాబి, జయమ్మ ,శ్రీదేవి, శ్యామల,బాగ్యమ్మ, పార్వతమ్మ, విజయ,నాగమణి, ఉషమ్మా,యాదమ్మ, రజియా, శేషమ్మ, జాన్ బి, అండాలు, సరిత, తదితరులు పాల్గొన్నారు.