హిందీని ద్వితియ భాషగా గుర్తించండి
మంత్రి ధర్మానను కోరిన ఒడియా ప్రతినిధులు
శ్రీకాకుళం, జూలై 23 : హిందీని రెండో భాషగా చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానికంగా ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఒడియా లింగ్వెస్ట్ మైనారిటీ సంక్షేమ సంఘం, ఒడియా టీచర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండో భాషగా ఉన్న తెలుగుకు బదులుగా హిందీని చేర్చాలని సభ్యులు కోరడం సరికాదన్నారు. దీనికి తెలుగు అధికార భాష సంఘం అభ్యంతరం తెలియజేస్తుందని పేర్కొన్నారు. 50 శాతం తెలుగును, 50 శాతం హిందీని రెండో భాషగా చేర్చాలని సభ్యులు కోరారు. అలాకాని పక్షంలో తెలుగు, లేదా హిందీ రెండో భాషగా విద్యార్థులు తీసుకేందుకు అవకాశం కల్పించాలని సభ్యులు కోరారు. దీనికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సత్యనారాయణ పాడి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఏఎంసీ అధ్యక్షుడు శ్యామ్ పురియా, గోపీనాథ్ సాహు, భువనేశ్వర్ పాణిగ్రహి, భాస్కర్‌నాయక్‌లు పాల్గొన్నారు.