హిందువులపై దాడులను సహించం
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా
కొత్తగూడెం, అక్టోబర్ 16: హిందువులపై జరుగుతున్న దాడులను సహించమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ బాయ్ తొగాడియా అన్నారు. దేశంలో హిందువులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని మతతత్వ శక్తులు హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో హిందువులు ఉన్నప్పటికీ భారత దేశమే హిందువులకు కేంద్ర బిందువన్నారు. గ్రామస్థాయి నుంచి విశ్వహిందూ పరిషత్‌ను బలోపేతం చేసేందుకు సమిష్టి కృషి జరుపాలని పిలుపునిచ్చారు. హిందువులకు సేవ చేసేందుకు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. వంద కోట్ల మంది హిందువులకు అండగా ఉండేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హిందువులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, దాడులను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు మెన్నుకంటి హనుమంతరావు, సురేందర్ రెడ్డి, నాయకులు గాదిరెడ్డి, కమటి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సురేష్, రాము, శివరామకృష్ణ, కూరపాటి రవీందర్, దారా రమేష్, పావని, విజయలక్ష్మి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.